27 నుంచి తెలంగాణ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌

Telangana Districts Cricket Tournament from 27– పోస్టర్‌ ఆవిష్కరించిన ఎన్నారై డాక్టర్‌ సతీశ్‌ కత్తుల
హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల అండర్‌-17 టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఈ నెల 27 నుంచి ఆరంభం కానుంది. హైదర్‌గూడలోని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షులు, శాట్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నారై వైద్యులు నాథ రమణ మూర్తి గోకుల, శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి పోస్టర్‌ను ప్రముఖ అంకాలజిస్ట్‌, భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం అధ్యక్షుడు సతీశ్‌ కత్తుల ఆవిష్కరించారు. ‘తెలంగాణ జిల్లాల్లో క్రికెట్‌ అభివద్ది చెందాలి. ఈ టోర్నమెంట్‌ నిర్వహణతో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రానుండటం అభినందనీయం’ అని సతీశ్‌ కత్తుల అన్నారు. అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ..’ ఈ టోర్నమెంట్‌లో ఉమ్మడి 9 జిల్లాలు సహా టీడీసీఏ ఎలెవన్‌ జట్లు పోటీపడుతున్నాయి. టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన క్రికెటర్ల నుంచి మూడు జట్లను తయారు చేస్తాం. మార్చి మూడో వారంలో అమెరికా క్రికెట్‌ అకాడమీ జట్టు ఇక్కడికి రానుంది. తెలంగాణ ఉమ్మడి జిల్లాల జట్లు, అమెరికా క్రికెట్‌ అకాడమీ జట్టుతో పోటీపడనున్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీతత్వం అనుభవం తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు దక్కనుంది’ అని అన్నారు. తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ జిల్లాల కన్వీనర్లు మహ్మద్‌ మతీఫ్‌, సురేందర్‌ రెడ్డి సహా కుమారస్వామి, బసివి రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love