– పాఠశాలలే దేవాలయాలు.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
దేశంలోనే తెలంగాణ రాష్ట్ర విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో విద్యా బోధన, మౌలిక వసతులు కల్పిస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో 26.17 లక్షలతో పూర్తి అయిన పాఠశాలను, డిజిటల్ తరగతులు ప్రారంభించి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,బట్టలు (దుస్తువులు) పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామీణులకు, పేదలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. ఇటీవల పెద్దబడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత ఈ బడి సొంతమన్నారు. విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని భావితరాలు ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వ ఆశయమాన్నరు. విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన బడులకు ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని తెలిపారు.23 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, లక్షకు పైచిలుకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూల్లో ప్రవేశాలు పొందారన్నారు. నాణ్యమైన విద్యా విధానం, ఇంగ్లీష్ మీడియంలో బోధన, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా అమలు చేస్తుందన్నారు. దేశంలో కెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణమని, రాష్ట్ర వ్యాప్తంగా 1002 గురుకుల పాఠశాలల్లో 5,99,537 మంది అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. గురుకులాలలో చదివే ప్రతి విద్యార్థి పై సంవత్సరానికి 1 లక్ష 25 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. గురుకులాలు, మోడల్ స్కూల్స్, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతూ ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ అందజేస్తున్నామని అన్నారు. మన ఊరు -మనబడి, మనబస్తీ- మనబడి పథకంతో విద్యా వ్యవస్థ రూపు రేఖలు మార్చామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలో 3 దశలుగా 26,065 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం కోసం రూ. 7289 కోట్లతో మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు.రాష్ట్రంలోసర్వ శిక్ష అభియాన్ కింద 44,588 పనులను చేపట్టి 38,182 పనులను పూర్తి చేశారని, విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, ఎంపీపీ లకవత్ మానస సుభాష్, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, పాఠశాల హెచ్ఎం మనీలా తదితరులుు పాల్గొన్నారు.