చారిత్రాత్మకమైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్లు గడిచింది. జూన్ 2 న రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జరుపుకొంటున్న ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు. కొన్ని వందలమంది యువకులు తెలంగాణ కోసం బలిదానాలు చేశారు. 1969లో తొలిదశలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం నడిచింది. అనేకమైన రాజకీయ సర్దుబాట్లతో ఆ ఆందోళన ఆగిపోయింది. ఆ తర్వాత ప్రపంచీకరణకు ఒక ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మారటం, దాంతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులకు, బాధలకు గురయ్యారు. నిరుద్యోగం పెరిగింది. ఉపాధి సన్నగిల్లింది. భారాలూ, పీడనా రెట్టింపయ్యాయి. వీటిని ప్రతిఘటించే ఉద్యమాలపై, ఆందోళనలపై నిర్భంధాలూ అణచివేతలూ పెరిగాయి. ప్రాంతాల అసమానతా, వనరుల దోపిడీ అధికమై ప్రజలలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే 1990ల చివరలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమం ఆరంభమయింది. దాదాపు పదిహేనేండ్ల పాటు ఏదో ఒక రూపంలో ఉద్యమ వేడిని కొనసాగించడం చెప్పుకోదగిన విషయం. అనేక రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టడం, నిరుద్యోగ, ఉద్యోగ, ప్రజా సమూహాలను కదిలించటంతో 2014 జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మూడున్నర కోట్లమంది జనాభా గల తెలంగాణ, ఇప్పుడు నాలుగుకోట్లకు పైగానే జనాభా కలిగి వుంటుంది.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యువత గానీ, ప్రజలు గానీ ఏమి కోరుకున్నారనేది ముఖ్యమైన విషయం. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు డిమాండ్లు బాగా ప్రచారం పొందాయి. అంటే ఈ ప్రాంతంలో పారుతున్న కృష్ణా, గోదావరి, ఇతర ఉపనదుల నుండి పారే నీళ్లను పంట పొలాలకు పారించడం మొదటిదయితే, రాష్ట్రానికి రావలసిన నిధులను రాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిని సాధించడం రెండవది. ఇక ముఖ్యమైనది నియామకాలు. ఇక్కడి ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి సమస్యను పరిష్కరించడం. ఉపాధిని పెంచడం. ఉద్యమం చివరిదశకొచ్చేప్పటికి ఈ డిమాండ్లు ద్వితీయస్థాయికి చేరి, ఆత్మగౌరవం అనే నినాదం ముందుకు వచ్చింది. ఇవన్నీ సాంస్కృతికమైన విషయాలుగా ముందుకు వచ్చాయి. ఇక్కడి మాట, పాట, కట్టు, బొట్టు, సామాజిక జీవనం అన్నీ చిన్నచూపుకు గురయ్యాయని, భాషా సాహిత్యాలనూ కించపరిచారనీ, ఆ విధంగా ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని దెబ్బతీశారనే చర్చా విస్తృతంగా జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా భావోద్వేగాలకు గురయ్యారు. పెద్దయెత్తున సాంస్కృతిక ప్రచారాందోళనలూ, ధూంధాం పేరిట ప్రజల్ని కదిలించడం జరిగింది. దశాబ్దాలుగా పాలక వర్గాలు అవలంభించిన విధానాలు, వారి ప్రయోజనాలు, ఇక్కడి భూస్వాముల, పెట్టుబడిదారుల దోపిడీ పీడన కారణంగా ఏర్పడిన ప్రజావ్యతిరేకత ప్రత్యేక రాష్ట్ర డిమాండును బలంగా తీసుకువచ్చింది. ఒకానొక స్థితిలో తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రజలకు మధ్య వైరుధ్యంగా మాటల యుద్ధాలు నడిచాయి.
ఏది ఏమైనా భౌగోళిక తెలంగాణను సాధించుకున్న తర్వాత, ఇక్కడి ప్రజల ఆర్థికాభివృద్ధి, సామాజిక సాంస్కృతిక అభివృద్ధికోసం ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చారిత్రకంగా చూస్తే ఇక్కడి ప్రజల ప్రధాన సమస్య భూమి సమస్య. భూమితో వున్న సంబంధాలే సామాజిక వెనుకబాటుకు కారణంగా వున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వమే ఆనాటి నైజాం, జమిందారీ, జాగీర్దారీ దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా దేశంలోనే అత్యంత చైతన్యయుతంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగించిన నేల ఇది. నాటి సామాజిక అణచివేతకూ, పీడనకూ, భూమి సమస్యకూ పరిష్కారాన్ని వెతికి దేశానికే ఆదర్శంగా నిలిచిన ధీర చరిత గల తెలంగాణ. పాలకుల కుట్రల ఫలితంగా ఇప్పటికీ పరిష్కారాన్ని సాధించలేకపోయింది. సాంస్కృతిక పరమైన ఆధిపత్యంపైనా ఆనాటి కళాకారులు, రచయితలు, మేధావులు, కమ్యూనిస్టులు పోరాటం చేశారు. ప్రజాసంస్కృతిని ఎలా నిర్మించుకోవాలో కూడా మనకు తెలియజేశారు. ఆనాటి రాజకీయ, సాంస్కృతిక చైతన్యమే నేటికీ తెలంగాణకు వారసత్వంగా నిలుస్తుంది. ఒక ఘనమైన చరిత్రకు ఆలవాలమైన ప్రదేశం ఈ తెలంగాణ. అలాంటి తెలంగాణ, ఈ పదేండ్లుగా ఏ దారిన నడుస్తున్నదో ఒకసారి మననం చేసుకోవటం అవసరం.
గత పదేండ్లూ ఒకే పార్టీ, నాయకుడి ఏలుబడిలోనే సాగింది. దశాబ్దం చివరిలో కొత్త ప్రభుత్వంతో కొత్త నాయకుడు అధికారంలోకి వచ్చాడు. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని అభివృద్ధికరమైన, అవసరమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేసింది. చెరువుల పునరుద్ధరణ, మంచినీటిని అందరికీ అందించడం, హరితహారం, పేదలకు ఇండ్లు, దళితులకు భూమి, అనేక వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు పూనుకున్నది. రోడ్ల నిర్మాణం, సుందరీకరణ, భవనసముదాయాలు మొదలైన వాటికి ప్రాధాన్యత కల్పించింది. సాగునీటికి సంబంధించి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చుచేసి చిన్న సాగునీటి ప్రాజెక్టులను వదిలేసింది. ముఖ్యమైన నియామకాల విషయాన్ని నిర్లక్ష్యం చేసింది. నిధులు రాబట్టడంలోనూ సరైన శ్రద్ధ పెట్టలేకపోయింది. ఉపాధిని కల్పించే ప్రణాళికలేవీ చేపట్టలేకపోయింది. శ్రామికుల ఆదాయాలనూ పెంచలేకపోయింది. విద్య, వైద్యం ప్రజలందరికీ అందుబాటులోకి తేవటానికి కృషి జరగలేదు. మొత్తంగా రాష్ట్రాభివృద్ధికి ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేయడంలో విఫలమయింది. సాంస్కృతిక పరమైన విషయంలో కూడా అభిమానపూర్వక ప్రకటనలు తప్ప ఆచరణాత్మక ప్రగతి కనడపడలేదు. సాంస్కృతిక కళాగుర్తింపును చేయగలిగింది కానీ ఆ దిశగా చేయాల్సిన కృషి జరగలేదు. విద్యలో, గ్రంథాలయాల ఏర్పాటులో, భాషాభివృద్ధిలో ఒక విధానాన్ని కూడా ప్రకటించలేకపోయింది.
ఇక సామాజిక పరమైన సమస్యల పట్లా నిరాసక్తంగా, నిర్లక్ష్యంగా పాలన కొనసాగింది. కుల దురహంకార హత్యలు, కుల వివక్షతలు సామాజిక అసమానతల పట్ల సంప్రదాయ పాలక వర్గ విధానాలే కొనసాగాయి తప్ప వాటి నిర్మూలనకు ఏ రకమైన చర్యలూ తీసుకోలేకపోయింది. అంతేకాదు ఒకరకంగా వివక్షతకూ వంతపాడింది. ఇకపోతే ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో నిరసన, ఆందోళన, ఉద్యమాలకు అవకాశమే ఇవ్వని నిర్భంధ, అణచివేత విధానాలనూ అవలంభించింది. మానవ హక్కులనూ ప్రజాస్వామిక విలువలను నిరాకరించింది. మళ్లీ ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికింది.
నిరుద్యోగం యధావిధిగా పెరగటం, ఉపాధి కొరవడటం, వ్యవసాయ సంక్షోభం, రైతు, కూలీల సమస్యలేవీ తీరకపోవటం, వివక్షతలు, అసమానతలు పెరగటం, దారిద్య్రం, పేదరికం, ఆకలి, ఆర్థిక వ్యత్యాసాలు కొనసాగుతుండటంతో ప్రజల్లో తిరిగి నిరసనలు మొదలయ్యాయి. వీటిని ఆసరా చేసుకుని అత్యంత చైతన్యయుత తెలంగాణలో మతతత్వ శక్తులు చెలరేగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రజల్లోని ఈ అసంతృప్తులు, మతతత్వ, కులతత్వాల వైపు మళ్లితే మరింత ప్రమాదంలో సమాజం పడుతుంది. రజాకార్ సినిమా ద్వారా ఆ రకమైన విభజన తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలప్రదం కాలేదు. కానీ అసంతృప్త జనం ఏదో ఉద్వేగానికి గురికావడానికి అవకాశం వుంది.
ఈ అనుభవాలను, పరిణామాలను మననంలో వుంచుకుని కొత్తగా వచ్చిన పాలకులు అడుగులు వేయాల్సి వుంటుంది. ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరిస్తామని కంచెలు పడగొట్టి మంచి ఆరంభమే చేసినా నిర్మాణాత్మక కృషి, సంఘటనల పట్ల స్పందన లేకపోతే తిరిగి ప్రజలు ప్రశ్నిస్తారు. రాష్ట్ర ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఇల్లు, ఉపాధి, ఉద్యోగం మొదలైన వాటిపై పనిచేయాల్సిన అవసరం వుంది. అప్పుడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలం దక్కుతుంది. ఆ దిశగా ఇప్పుడైనా కృషి మొదలుపెట్టాల్సిన అవసరం వుంది. అప్పుడే దశాబ్ది ఉత్సవాలకు సార్ధకత ఏర్పడుతుంది.
తెలంగాణ రాష్ట్ర గేయం
జయజయహే తెలంగాణ..
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం!!
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ – రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
జానపద జనజీవన జావళీలు జాలువారే
కవి గాయక వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగతపరిచే గీతాల జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద
సిరులు పండె సారమున్న మాగాణి కరములీయ
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
గోదావరి కష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి!!
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ వుండాలి
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి!!
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
– కె.ఆనందాచారి, 9948787660