– ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌లు గురువారం ప్రారంభోత్సవం చేశారు. 100 సీట్లతో ఈ సంవత్సరం నుండే కళాశాల ప్రారంభం కానున్నట్లు, నేటి నుండి తరగతులు ప్రారంభం కానున్నట్లు వారు తెలిపారు. రూ.8.5 కోట్లతో పాత కలెక్టరేట్, పౌరసరఫరాలు, గిరిజనాభివృద్ది అధికారి, రోడ్లు భవనాల శాఖల కార్యాలయాలను వైద్య కళాశాల, హాస్టళ్లకు అనుగుణంగా రెనోవేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య కళాశాలలో సమకూర్చిన ల్యాబ్‌లు, విద్యార్థులకు హాస్టల్, మౌళిక సదుపాయాల కల్పనలు మంత్రులు పరిశీలించారు. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంత పిల్లలకు వైద్య సీట్లు ఎక్కువగా పొంది, మన ప్రాంతం నుండి వైద్యులు ఎక్కువగా తయారవ్వాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో తీసుకున్న నిర్ణయమని వారు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. బిడ్డ కడుపులో పడగానే, న్యూట్రిషన్ కిట్, ప్రసవం కాగానే కేసీఆర్ కిట్ ను ప్రభుత్వం అందిస్తున్నదని మంత్రి అన్నారు. ఈ పథకాలతో గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం జరిగే ప్రసవాలు, నేడు 76.8 శాతానికి చేరుకున్నాయన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం సమకూర్చాలని రవాణా శాఖ మంత్రి కోరగా, త్వరలో అందజేయనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవాలు అందజేస్తున్నట్లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లోకసభ సభ్యులు నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా నాగేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎస్. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్. బి. మాలతి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణను
నెంబర్ వన్ చేయడమే లక్ష్యం
మద్దులపల్లిలో నర్సింగ్ కళాశాలకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
వైద్య, ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరత తీర్చాలని ఉద్దేశ్యంతో ప్రభుత్వం జిల్లాల్లో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ 5 ఎకరాల్లో రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు, ఒక్క సంవత్సరంలోనే పూర్తిచేసి అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సులు అంటే ఆసుపత్రుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రం నుండే ఉండేవారని, రాష్ట్రంలో కావాల్సిన మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది వుండే వారు కారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది గ్రహించి, ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. త్వరలో జిల్లాలో బిఎస్సి పారా మెడికల్ కళాశాల మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం సీఎం కలల ప్రాజెక్ట్ అని, ఇది పూర్తయితే కాలంతో పనిలేకుండా, సాగర్‌లో నీళ్లు రాకపోయినా రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. పాలేరు నియోజకవర్గానికి రూ.125 కోట్ల ఎస్జిఎఫ్ నిధులు మంజూరు అయినట్లు, అట్టి నిధులతో గ్రామ, గ్రామానికి సిసి రోడ్స్, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ నర్సింగ్, ఫిషరీస్, ఇంజనీరింగ్ కళాశాలలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుందని తెలిపారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిషరీస్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలతో నియోజకవర్గం విద్యారంగంలో మరింత ముందుకు వెళుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్, కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.మాలతి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రత్న కుమారి, ఖమ్మంరూరల్ ఎంపిపి బెల్లం ఉమ పాల్గొన్నారు.
మంత్రిని రైతులు కలవకుండా అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు
మండలంలోని మద్దులపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకి వినతి పత్రం ఇవ్వకుండా స్థానిక రైతులను బిఆర్‌ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం గ్రామంలో జరుగుతున్న కార్యక్రమం గురించి మాట్లాడడానికి గ్రామ సర్పంచ్ కర్లపూడి సుభద్రకు సైతం అవకాశం ఇవ్వలేదు. మద్దులపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 171లో భూ పంపిణీ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తమ్మినేని సుబ్బయ్య ఆధ్వర్యంలో 22 మంది నిరుపేద దళిత కుటుంబాలకు భూమిని కేటాయించారు. అప్పటి నుండి ఆ భూమి వారి స్వాధీనంలో ఉన్నది. అట్టి భూమికి సంబంధించి అసైన్డ్ పట్టాలు కూడా ఉన్నాయి. దళితుల అసైన్డ్ పట్టా భూముల్లో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించి అధికారులు, భూ సేకరణ చేయడంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నష్టపోతున్న భూముల స్థానంలో సమానమైన భూమిని అదే గ్రామంలో మరొక చోట కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రైతుల తరుపున మంత్రి హరీష్ రావుకి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయగా రూరల్ ఏసిపి బస్వారెడ్డి, సీఐ రాజిరెడ్డి అనుమతి ఇవ్వగా బిఆర్‌ఎస్ నాయకులు మంత్రిని కలవకుండా, కనీసం వినతి పత్రం కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడు. గ్రామానికి నర్సింగ్ కళాశాల రావడాన్ని సిపిఎం స్వాగతిస్తుంది. కానీ కళాశాల నిర్మాణానికి భూములు కోల్పోతున్న దళిత రైతులకు నష్టపోతున్న భూమి స్థానంలో భూమిని ఇవ్వమని మంత్రిని అడగటానికి కూడా కనీసం అవకాశం లేకుండా చేశారని రైతులు, నాయకులు వాపోతున్నారు. పోలీస్ వారు అనుమతి ఇచ్చినా స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు రైతులను అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు.చివరికి విషయం పాలేరు ఎమ్మేల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి తెలపడంతో సమస్యలపై రేపు మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.