– కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే
– బీఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ రాజ్య సమితి :యూపీ సీఎం యోగీ ఆథిత్యనాథ్
నవతెలంగాణ – కాగజ్‌నగర్/కాగజ్‌నగర్‌రూరల్/ వేములవాడ
సంపన్న రాష్ట్రం తెలంగాణ.. కేసీఆర్ పాలనలో అవినీతిలో కూరుకుపోయి అప్పుల కుప్పగా మారిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో శనివారం రామరాజ్య స్థాపన సంకల్పసభలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ పక్కన బెట్టారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలంటే బీజేపీ గెలవాలని, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని, వీరిద్దరి కామన్ ఫ్రెండ్ ఎంఐఎం అని తెలిపారు. యూపీలో ఒకే ఒక్క సీటు గెలిచిన బీఎస్పీ సిర్పూర్‌లో గెలుస్తుందా అని ప్రశ్నించారు. సిర్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. హరీష్‌ను ఎన్నికల్లో ఆశీర్వదించాలని, జనవరి 22 తర్వాత రామమందిర దర్శనానికి ఎమ్మెల్యే హరీష్‌తో వచ్చి రాముడి ఆశీర్వాదం పొందాలని తెలిపారు. అభ్యర్థి పాల్వాయి హరీష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, దోపిడీదారులకు అడ్డాగా సిర్పూర్‌ను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తనను నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్షంగా ఉండాలని తీర్పునిచ్చారని, నిస్వార్థసేవకై మీలో ఒకడిగా నిలబడ్డానని, ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.కరీంనగర్ జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహించిన సభలో యోగీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారన్నారు. బీఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ రాజ్యసమితి అని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో బీజేపీ అభ్యర్థులపై అక్రమంగా కేసులు పెట్టారని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరికీ జవాబు చెప్తామన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో అద్భుతమైనవని కొనియాడారు. బీఆర్‌ఎస్ పాలనలో అమరుల త్యాగాలను పక్కనపెట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవినీతిపరులను జైలుకు పంపిస్తామన్నారు.