– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపెల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ – గంగాధర : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపెల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని వీఏఎస్ గార్డెన్ లో నిర్వహించిన సంక్షేమ పథకాల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపెల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదని, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని అన్నారు. నాటి ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , ప్రత్యేక రాష్ట్రం వస్తే రాష్ట్రం చీకటి అవుతుందని, వైర్ల మీద బట్టలు ఎండేసుకోవాలని హేళన చేశారని అన్నారు. ఆంధ్రపాలకుల మాటలు, హేళనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. చావు నోట్లో తలపెట్టి భరి గీసి నిలబడి కేసీఆర్, ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు జరిగాయని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోనే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా ఒక లక్షా నూట పదహారు రూపాయలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. 2000 రూపాయలు ఆసరా పెన్షన్, రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 5000 రూపాయలు అందిమచడంతోపాటు , రైతుబంధుతో రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కంటి వెలుగుతో ఉచిత వైద్యం , కళ్లద్దాల పంపిణీ, అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు, గొల్ల కురుమలకు విడతల వారిగా గొర్రెలు పంపిణీ వంటి ఎన్నో బృహత్తర పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటుతో నాణ్యమైన విద్య, కులవృత్తులను ప్రోత్సహించడానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు పుల్కం అనురాధ, మునుగోటి ప్రశాంతి, ఎంపీపీలు వేణు గోపాల్, కవిత, స్వర్ణలత, రవీందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.