మంత్రి హరీశ్‌రావు
లిటిల్ స్టార్స్ అండ్ షీ ఆస్పత్రి ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
నీతి అయోగ్ నివేదిక ప్రకారం వైద్య రంగంలో అవయవదానంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అలాగే హెల్త్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం ఉందని, గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగిందని పేర్కొన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రయివేటు ఆస్పత్రిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి మంత్రి ప్రారం భించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో రాష్ట్రం గణనీయ పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెలలో గాంధీ ఆస్పత్రిలో సేవలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అలాగే త్వరలోనే 10 వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని సినీ దర్శకుడు రాజమౌళిని మంత్రి అభినందించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, ఇతర సేవలకు సంబంధించిన వ్యయాలను భరించేందుకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సతీష్, స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.