– రాష్ట్రంలో సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి : పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– బియ్యం ఎగుమతి విధానంపై వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సదస్సు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
దేశంలోనే వరి ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని వెల్లడించారు. రాష్ట్రం నుంచి తొలిసారి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘బియ్యం ఎగుమతి విధానం’ అనే అంశంపై మంగళవారం ఒకరోజు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి మంత్రి హాజరై మాట్లాడారు. రైతాంగానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల స్థానిక అవసరాలకు పోను, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన బియ్యం పోను, కేంద్ర నిల్వల కోసం సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపులు పోగా ఇంకా సుమారు 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రంలో మిగులు ఉంటుందని అన్నారు. మిగులు ధాన్యం మార్కెట్ చేయడంలో భాగంగా ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడాన్ని సదావకాశంగా తీసుకొని, ఆ ప్రభుత్వంతో నేరుగా అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. దొడ్డు రకాల్లో ముఖ్యమైన మీఖ-1010, ఐఆర్-64ను రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్నారని, వీటికి ఫిలిప్పీన్స్‌లో అధిక డిమాండ్ ఉందని తెలిపారు. వరి నేరుగా విత్తే పద్ధతి, రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం, తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయడంపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. ఎగుమతికి అనుకూలమైన వరి రకాలను ఉత్పత్తి చేయడానికి రైతులకు తగిన ప్రోత్సాహకాలు, ఎగుమతిదారులకు విధానపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. ఆధునిక రైస్ మిల్లును వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి రైతులకు, యువతకు శిక్షణ ఇచ్చి ఆధునిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం యూనివర్సిటీ వీసీ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. ఫిలిప్పీన్స్ ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని, కాబట్టి ఆ దేశాన్ని తెలంగాణ బియ్యానికి అనుకూలమైన మార్కెట్‌గా గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లయితే ఇక్కడ పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టేనని చెప్పారు. అంతేకాకుండా, ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి బియ్యం ఔత్సాహిక ఎగుమతి దారులకు సరఫరా చేసినట్టయితే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండానే ఎగుమతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని మంత్రికి సూచించారు. విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామో దర్ రాజు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత డాక్టర్ సమరేండు మహంతి.. ఎగుమతుల విధానంపై ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బి.కృష్ణారావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, అపెడా అధికారులు, రైతు నాయకులు, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.