2న ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభ

– అదే రోజు భట్టి పాదయాత్ర ముగింపు.. పొంగులేటి చేరిక..
– హాజరుకానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే
నవతెలంగాణ – కూసుమంచి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో 2వ తేదీన నిర్వహించే తెలంగాణ జనగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతున్నట్టు తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర ముగించుకుని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ‘హాథ్‌ సే హాథ్‌’ జోడో యాత్ర, ఏఐసీసీ దిశా నిర్దేశం ప్రకారంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భగభగ మండే ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను చేశారని తెలిపారు. ఈ యాత్రలు కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవానికి దోహదపడతాయన్నారు. ఖమ్మంలో జులై 2వ తేదీన నిర్వహించే తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లు, పాదయాత్ర ముగింపు నిర్వహణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ దగ్గరుండి కోఆర్డినేషన్‌ చేస్తారని చెప్పారు. ప్రజల సంపదను కేసీఆర్‌ లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రకు 600 వాహనాలతో వెళ్లడం వెనక దాగివున్న ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి కేసీఆర్‌కు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ప్రజలది కాదా అని నిలదీశారు. లిక్కర్‌ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇప్పటికి జైల్లోనే ఉన్నారని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సైతం విచారణ చేశారని, అదే స్కాంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను ఇవ్వాలో, రేపో అరెస్టు చేస్తామని హడావిడి చేసిన దర్యాప్తు సంస్థలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నాయని ప్రశ్నించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, కవిత ఇద్దరూ ఒక కేసులో నిందితులైనప్పుడు కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదో ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌ రావు, పీసీసీ ఐటీ సెల్‌ చైర్మెన్‌ మదన్‌ మోహన్‌ రావు, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న తదితరులు ఉన్నారు.

Spread the love