– ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ ఉద్యమ రచన మొదలైందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. నలమాస కృష్ణ రచించిన ”ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం” పుస్తకావిష్కరణ సభ శనివారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో నిర్వహించారు. ఛాయ ఈ పుస్తకాన్ని ప్రచురించారు. మాందాల భాస్కర్ అధ్యక్షత వహించిన ఈ సభకు కె.శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ప్రపంచ గర్వించదగిన విద్యార్థి ఉద్యమం తెలంగాణ విద్యార్థి ఉద్యమం అని, అందులో ఆత్మహత్యలు బాధాకరం అన్నారు. విద్యార్థుల త్యాగం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని సంఘటనగా కాకుండా ఆ విద్యార్థి ఉద్యమ క్రమాన్ని రచయిత ఇందులో రికార్డ్ చేశారని తెలిపారు. విద్యార్థుల చేతిలో నుంచి ఉద్యమాన్ని లాక్కునేందుకే రాజకీయ జేఏసీ ఏర్పడిందని ఇందులో చేసిన సూత్రీకరణ చర్చనీయాంశ మన్నారు. ప్రొఫెసర్ సీ. కాశీం మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం మీద ఇప్పటి వరకు నిర్మాణ ాత్మక రచన లేదని, ఆ ఖాళీని ఈ పుస్తకం కాస్త పూరిస్తుందని తెలిపారు. నెత్తురు చిందకుండా తెలంగాణ వచ్చింది అనుకునేవారు తయారైన కాలంలో చిందిన నెత్తురును నమోదు చేసిన పుస్తకం ఇదన్నారు. పుస్తక రచయిత నలమాస కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమం పై చేసిన ఈ పరిశోధన కేవలం విద్యార్థులకు సాధారణంగా ఉండే లక్షణాన్నే కాకుండా సామాజిక ఉద్యమాల్లో వాళ్లు పోషించిన పాత్రనూ విశ్లేషిస్తుందని తెలిపారు. ఇంకా పుస్తక సహా సంపాదకుడు డేవిడ్, ఛాయ సంపాదకులు అరుణాంక్ లత, పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడారు. ప్రొఫెసర్ వెంకటేష్ నాయక్, ప్రొఫెసర్ గాలి వినోద్, ప్రొఫెసర్ ననుమాస స్వామి, దుర్గం భాస్కర్, కోట శ్రీనివాస్, దరువు ఎల్లన్న, స్టాలిన్, కంచర్ల బద్రి, మోహన్ ధరావత్, నెల్లి సత్య తదితరులు పాల్గొన్నారు.