– ప్రశంసించిన తమిళనాడు మంత్రి పీటీఆర్
– ఇన్నోవేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నం : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ఐటీ పాలసీ అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్(పీటీఆర్) ప్రశంసించారు. వాటిపై అధ్యయనం చేసేందుకు ఆయన ఆధ్వర్యంలో ఒక బందం మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న పీటీఆర్ బందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశమైంది. ఐటీ ప్రగతిపై, అందుకు దోహదం చేసిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తాము తెలంగాణలో పర్యటిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పీటీఆర్ తెలిపారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటి పాలసీ, అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కెేటీఆర్ వివరించారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని, అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడి ఇక్కడి ఐటీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందిందని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పరిశ్రమకు అనేక విధాలుగా మద్దతు అందించడం ద్వారా దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఐటితోపాటు ఐటీ అనుబంధ రంగాలకు ప్రత్యేకంగా ఒక పాలసీని తయారు చేసిన విధానం గురించి విస్తతంగా వివరించారు. తాము పాలసీలను రూపొందించే క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలతోపాటు పరిశ్రమలో ఉన్న భాగస్వాముల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకున్నామనీ, వారికి ఎలాంటి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందో తెలుసుకుని వాటన్నింటినీ తమ పాలసీల్లో పొందుపరిచామన్నారు. హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకు అత్యంత కీలకమన్న విషయాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ భారీ ఎత్తున మౌలిక వసతులను కల్పించిందని చెప్పారు. తమిళనాడు ఐటీ శాఖ మంత్రిగా ఈ మధ్య బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన ఉపయుక్తంగా ఉంటుందన్న నమ్మకాన్ని పీటీఆర్ వ్యక్తం చేశారు. ఇక్కడి ఆదర్శవంతమైన విధానాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.