దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రమే గేట్ వే: మోడీ

నవతెలంగాణ – సంగారెడ్డి: దక్షిణ భారత దేశానికి తెలంగాణ రాష్ట్రమే గేట్ వే అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని.. ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత పటేల్ గూడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభావేదికపైకి మోడీని బీజేపీ నేతలు పూల రథంలో ఆహ్వానించారు. ఓపెన్ టాప్ జీప్ ను పూలదండలతో అలంకరించి మోడీని అందులో తోడ్కొని వెళ్లారు. ప్రధానితో పాటు ఎంపీ కిషన్ రెడ్డి వాహనంలో వేదికపైకి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు మోడీపై పూల వర్షం కురిపించారు.ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలతో రెండో రోజు కూడా ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు.
సంగారెడ్డిలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను బేగంపేటలో ప్రారంభించామని చెప్పారు. దీంతో ఏవియేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపు చేశామని తెలిపారాయన. ఘట్ కేసర్ – లింగంపల్లి మధ్య ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లతో కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని తమ ప్రభుత్వం నమ్ముతుందని మోడీ చెప్పారు. ఈ సందర్భంగా తనకు కుటుంబం లేదంటూ ఇండియా కూటమి నేత లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని విమర్శలు గుప్పించారు. రూ.140 కోట్లకు పైగా ఉన్న భారతీయులంతా తన కుటుంబమే అని చెప్పారు.

Spread the love