ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ – ఖరగ్ పూర్: ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో మరణించాడు. అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరణించిన విద్యార్థి.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తున్న కే కిరణ్ చంద్ర (21) తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా తుఫ్రాన్ వాసి అని భావిస్తున్నారు. కిరణ్ చంద్ర మరణించిన సంగతి ఆయన హాస్టల్ సహచర విద్యార్థులు తమకు సమాచారం ఇచ్చారని ఐఐటీ-ఖరగ్ పూర్ వర్గాలు తెలిపాయి. వెంటనే చికిత్స కోసం క్యాంపస్ లోని దవాఖానకు తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు.కిరణ్ చంద్ర మరణంపై కేసు నమోదు చేసుకుని, పోస్ట్ మార్టం కోసం మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ కం దవాఖానకు తరలించామని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. కిరణ్ చంద్ర ఆత్మహత్యకు పాల్పడటంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ విద్యార్థులు, స్టాఫ్, ఫ్యాకల్టీ దిగ్భ్రాంతికి గురయ్యారు. కిరణ్ చంద్ర మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నట్లు ఐఐటీ ఖరగ్ పూర్ ఓ ప్రకటనలో తెలిపింది.

Spread the love