తెలంగాణ బతుకు చిత్రం

1956లో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్ని కలిపారు. పుష్కర కాలంలోపే మా రాష్ట్రం మాకు కావాలి అనే స్థితికి పాలకుల విధానాలు, పరిస్థితులు, ఒక ప్రాంత ఆధిపత్య ధోరణి, భాషపై చులకన, ఒప్పందాల ఉల్లంఘన… ఇలా ఎన్నో అంశాలు విడిపోవాలనే వాంఛకు హేతువులైనాయి. 1969 ఉద్యమాన్ని కుర్చీ రాజకీయాలు కబళించాయి. 11 మంది ఎం.పీల గొంతు అణచివేసింది కేంద్రం. 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులు నేలరాలారు. మళ్లీ 1996 నుండి మలిదశ పోరాటం ప్రారంభమైనా… 2001 కి ఉద్యమరూపం దాల్చింది. విడిపోవాలనే డిమాండ్‌ వెనుక వాస్తవాలు గమనించాలి. ఆంధ్రా వుద్యోగులు పదిన్నర లక్షలుంటే, తెలంగాణ ఉద్యోగులు రెండున్నర లక్షలున్నారు. ఆంధ్రాలో ఆసుపత్రులు 556 వుంటే తెలంగాణలో 270. పాఠశాలలు ఆంధ్రాలో 26,800 వుంటే, ఇక్కడ 18,000 లోపు. ఇలా ఎన్నో రకాల వివక్షతల్ని అంకెలు, సంఖ్యలతో వివరంగా, విపులంగా సోదాహరణలతో శంకర్‌ రాశారు ఈ పుస్తకంలో.
ఈ రచయిత అలనాటి (1969) తొలి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రచనలు చేశారు. ”ఓరోరి ముఖ్యమంత్రి/ నువ్వంటే తెగిన మంత్రి/ తేదికి చూడు జంత్రి/ నీకు భజింస్తాం భజంత్రి/ తెలంగాణ నాడు ధ్యేయం/ లేదోయి లేదు సాయం/ నువు లేపినట్టి గాయం/ రాయించె ఇట్టి గేయం” అంటూ కవిత్వం రాశారు (పేజీ.54). ఎన్నెన్నో రచనలు… వివరణలతో రాశారు. రచయిత కృషి విలువైనది. ఈ గడ్డ మీద వున్న సీమాంధ్రుల కార్పొరేట్‌ ఆస్పత్తులు, వాటి యజమానులు, ప్రత్యేక మండళ్లు, కార్పొరేట్‌ సంస్థలు. ఆంధ్రా రియల్టర్ల భూ భాగోతం, వేలాది ఎకరాల ఆక్రమణలు, భూ కేటాయింపులు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు బాబు హయాంలో ప్రభుత్వ సంస్థల విక్రయాలు, మార్కెట్‌ విలువ, సర్కార్‌ అమ్మిన స్వల్ప ధరలు… కోట్లకు పడగలెత్తుతున్న ఆంధ్రా గుత్తేదార్లు, ఆస్తుల విలువ లెక్కలతో అందించారు. కోర్టుల ద్వారా ఇక్కడి భూములు కాపాడుకునే ప్రయత్నాలూ రాశారు. మలిదశ ఉద్యమంలో ప్రభుత్వ నిర్బంధాలు, కేసులు, క్లాజులు, మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మె, శ్రీ కృష్ణ కమీషన్‌, జే.ఏ.సీ ల ఏర్పాటు, ధూం… ధాం… లాంటి సాంస్కృతిక ఉద్యమాలు… ఉమ్మడి పది జిల్లాల్లోని అక్షరాస్యత గ్రామాలు, మండలాలు, సాగుభూమి హెక్టారుల్లో, ఖనిజ సంపద, పరిశ్రమలు, ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ముఖ్య నదులు లాంటి వివరాలు ఓ పట్టికగా అందించారు. రచయిత 1864 నుండి 1945 దాకా పాలనా పరంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల స్థాపన, ఆనాటి వైద్య పరిశ్రమలు (1873 – 1947 దాకా) అందించారు. విలువైన ఈ పుస్తకం సామాజిక కార్యకర్తలకు, రాజకీయాల్లో పనిచేసే వారికి చక్కటి కరదీపిక.
– తంగిరాల చక్రవర్తి, 9393804472

Spread the love