Telangana : తెలంగాణలో కొత్తగా మరో మూడు మండలాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది. కొత్త మండలాలు నిర్మల్‌ జిల్లాలో రెండు ఏర్పాటు చేయబోతుండగా.. వనపర్తి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయబోతున్నది. వనపర్తి జిల్లా ఏదుల మండలాన్ని ఎనిమిది గ్రామాలతో ప్రతిపాదించింది. ఇందులో చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలను కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయనున్నది.
నిర్మల్‌ జిల్లాలో ప్రభుత్వం మాలెగావ్‌, బెల్తారోడాను మండలాలుగా ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు ప్రైమరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి(బి), మోలా, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిఘ్వా, మాలేగావ్‌, గోదాపూర్‌, కుప్టి, వర్ని గ్రామాలను కలుపుతూ మాలేగావ్‌ మండలాన్ని ప్రతిపాదించింది. ఇక బెల్తాడోరా మండలాన్ని 12 గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఇందులో ఝరి (కే), వాజ్హరి, బోల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్‌, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర గ్రామాలను కలుపుతూ మండలంగా ప్రతిపాదించింది.

Spread the love