– టూరిజం అభివృద్ధికి నిధులు
– జిల్లాలో ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు
– ఖిల్లాపై రోప్‌వే నిర్మాణానికి పర్యాటక శాఖ అనుమతులు
-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచ పటంలో తెలంగాణ పర్యాటకానికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వ్వసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు, ఖమ్మం ఖిల్లా, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. పర్యాటక రంగం అభిృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం కల్పించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో దీనిని పూర్తి చేసుకుని ఖమ్మం జిల్లాలో ప్రారంభించారని చెప్పారు. నెలకు ఒకసారి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లోని పర్యాటక ప్రాంతల్లో కుటుంబాలతో కలిసి బస చేయాలనే మంత్రి సూచన అభినందనీయమన్నారు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు అడవులు ఎకో టూరిజానికి అనువుగా ఉన్నాయని తెలిపారు. నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం మొదలు భద్రాచలం సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖిల్లాకు రోప్‌వే కావాలన్న డిమాండ్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. అందుకు ంత్రి జూపల్లి కృష్ణారావు అనుమతులు ఇస్తూ వెంటనే సంతకాలు చేశారని, త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు నేలకొండపల్లి బౌద్ధారామాల వద్దకు జపాన్ లాంటి దేశాల నుంచి బుద్ధిష్టులను ఆహ్వానించాలన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు రావడంతో స్థానికంగా ఆదాయంతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్‌కు కేందరమని, ఆ ఉద్యోగులు సెలవుల్లో ప్రశాంతంగా గడిపేందుకు అడవుల్లో ట్రెక్కింగ్, వాకింగ్ ట్రాక్, రిసార్ట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు.
ఖిల్లాపై కిలోమీటర్ రోప్ వే: మంత్రి జూపల్లి
ఖిల్లాపై కిలోమీటర్ మేర రూ.30 కోట్లతో రోప్ వే నిర్మాణానికి చర్యలు చేపడుతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రాష్ట్రంలో టూరిజం కొత్తపుంతలు తొక్కనుంది తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను రప్పించడానికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రపంచంలో తక్కువ జనాభా, వనరులు లేకున్నా ఎన్నో దేశాలు టూరిజంలో పేరుగాంచాయన్నారు. మన రాష్ట్రంలో అన్ని వనరులూ ఉన్నాయన్నారు. వీలైనంత త్వరలో రోప్‌వే నిర్మాణం చేపడుతామన్నారు. జిల్లాలో 2200 సంవత్సరాల పూర్వం నాటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధస్థూపం, భక్త రామదాసు ధ్యానమందిరం, పాలేరు, వైరా రిజర్వాయర్లు వంి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ మార్గాలుగా ప్రచారం కల్పించాలని అన్నారు.
ఖిల్లాకు వెయ్యి ఏండ్ల చరిత్ర : మంత్రి తుమ్మల
ఖమ్మం ఖిల్లాకు వెయ్యి ఏండ్ల చరిత్ర ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లి భక్తరామదాసు, బౌద్ధస్థూపాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశానన్నారు. రోప్‌వే వేస్తే తప్ప ఖిల్లాలో విహారానికి అవకాశం లేదన్నారు. భద్రాద్రికి రైల్వే లైన్ కనెక్టివిటి వస్తున్నట్టు, నేషనల్ హైవే, విమాన సేవలు రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం రాకుండా ఓఆర్‌ఆర్ ద్వారా నేరుగా భద్రాచలం వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. గోదావరిలో పాపికొండలు తదితర విహార యాత్రలకు ప్యాకేజీలు చేపట్టి పర్యాటకులను ఆకర్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, టూరిజం అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేష్ రెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా తదితరులు పాల్గొన్నారు.