తెలంగాణ యుద్ధభేరి

Telangana war heroఈ వీరభూమిగన్న విప్లవోద్యమ అగ్రజుల్లో అతనొకడు… అస్తమించే సూర్యుడిలో రేపటి సూర్యోదయాన్ని దర్శించినవాడు… కత్తుల వంతెనపై నిలబడి కాలాన్ని కలగన్నవాడు.. కష్టాలమయమైన సమాజాన్ని మార్చడానికి అలుపెరుగని పోరాటమైనవాడు బతుకంతా పీడిత ప్రజల బంధమైనవాడు.. అతడే అందరూ డీవీ అని ప్రేమగా పిలుచుకునే దేవులపల్లి వెంకటేశ్వరరావు. నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలోని బండమీద చందుపట్ల ఆయన స్వగ్రామం. తండ్రి వరదరావు దేశముఖ్‌. తల్లి గోపమ్మ. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. చిన్నతనం నుంచే విప్లవభావాలు పునికిపుచ్చుకున్న దేవులపల్లి 1934లో ఖమ్మంలో జరిగిన 3వ ఆంధ్ర మహాసభలకు పరీక్షలను బహిష్కరించి పాల్గొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర గీతం ఆలపించి బహిష్కరణకు గురయ్యాడు. ఆ తరువాతే మార్క్సిస్టు సాహిత్యంతో సంబంధాలు ఏర్పడ్డాయి. చదువు పూర్తికాగానే గ్రామానికి వచ్చి ఊరికి దూరంగా తన మామిడితోటలో ఏసుకున్న గుడిసెలో అధ్యయనమే ధ్యేయంగా పుస్తకాలు చదివాడు. నరనరాన విప్లవ భావాలను నింపుకున్నాడు.
ఫ్యూడల్‌, సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడై ఉండి కూడా, ఆనాడు బలంగా ఉన్న సంప్రదాయాలను, కులాచారాలను, కట్టుబాట్లను, పట్టుదలతో ధిక్కరించి తన 22ఏండ్ల వయసులో ఒక బాల వితంతువును వివాహం చేసుకున్నాడు. సాంస్కతిక రంగంలో ఒక తిరుగుబాటుకు పునాది వేసాడు. యూనివర్సిటీ చదువు పూర్తయ్యాక, చండ్ర రాజేశ్వరరావుతో జరిపిన రాజకీయ చర్చల వల్ల పార్టీలో చేరి పూర్తికాలం కార్యకర్తగా తన జీవితాన్ని ఆరంభించాడు. 1940లో జరిగిన ఆంధ్ర మహాసభ నాటికే, రాజకీయ అవగాహన ఏర్పడడం వలన తన గ్రామంలో రాత్రిబడులు నడిపాడు. నిజాం చీకటి పాలనకు వ్యతిరేకంగా ఆ కాలంలోనే ప్రజాఉద్యమానికి అంకురార్పణ చేసాడు. క్రమంగా 1942 నాటికే సూర్యాపేట ప్రాంతంలోని అనేక గ్రామాలు వెట్టిని నిరాకరించే స్థాయికి చేరుకున్నాయి. 1944లో నల్లగొండలో జరిగిన ఆంధ్ర మహాసభలో, అప్పటికే జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న దేవులపల్లిని ఆంధ్ర మహాసభకు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1946లో ఉద్యమం సాయుధపోరాట రూపం తీసుకోవడంతో రహస్య జీవితంలోకి వెళ్లిపోయాడు.
పాలకుర్తిలో అయిలమ్మ కుటుంబంపై విసునూరు రామచంద్రారెడ్డి కక్షసాధించే సమయంలో ఆమెకు అండగా, పంట రక్షణకు భీంరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో వాలంటీర్లను పంపింది దేవులపల్లే. ఆ తర్వాతే గ్రామ రక్షణ కోసం అప్పటికప్పుడు 60మంది వాలంటీర్లతో దేవురుప్పుల నుండి బయలుదేరిన దేవులపల్లి దారిలో తుమ్మచెట్లను నరికి, గుత్పలుగా చేసుకొని యువకులతో పాలకుర్తికి వెళ్లి పోరాటం కొనసాగించాడు. ఆ సంఘటనే గుత్పలసంఘానికి అంకురార్పణ. ఆ అనుభవమే అనేక గ్రామాల్లో వాలంటీర్‌ దళాలు ఏర్పాటవ్వడానికి, ఉద్యమానికి సమరశీలతను చేకూర్చడానికి కారణమైంది. ఆ వాలంటీర్‌ దళాలే ఆ తర్వాత ‘గుత్పల సంఘం’గా పేరుపొందాయి. గ్రామగ్రామాన ప్రాధమిక దశలో ప్రజల పోరాట సాధనాలయ్యాయి. గుత్పలతో చేసే శబ్దం వింటే చాలు దొరల గడీలో గుబులు పుట్టేది.
దేవులపల్లి నాటి తెలంగాణ ప్రజల గుండె ధైర్యం.. నిజాం పోలీసుకు, రజాకారు మూకలకు సింహస్వప్నం.. ఎవరికీ తలవంచని తెలంగాణ వీరత్వం.. హైదరాబాద్‌ కుట్రకేసులో అరెస్ట్‌ అయినప్పుడు, కోర్టులో ”భారత విప్లవం భారత ప్రజల జన్మ హక్కు. ఆ విప్లవం కోసం పని చేయడం విప్లవకారుల జన్మహక్కు. ఆ జన్మహక్కును ఏ రాజ్యాంగం, ఏ చట్టం, ఏ పాలకవర్గాల లక్షలాది సాయుధ దళాల పాశవిక నిర్బంధ విధానమూ హరించజాలదు.. అణిచివేయజాలదు. భారత విప్లవం జయించి తీరుతుంది. ప్రపంచ విప్లవ గమనం సూచిస్తున్న చారిత్రిక సత్యం ఇదే ఇదే ఇదే” అని నినదించాడు. సాయుధ పోరాటం మొదలైనప్పటినుండి విరమించేదాకా, ఉద్యమ ప్రతి మూలమలుపులో భాగమయ్యాడు. నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, తిరుగుబాటుకు సారథుల్లో ఒకడిగా సామాన్యులను సాయుధులుగా తీర్చి దిద్దిన యుద్ధభేరి అతడు! విప్లవ వీరుల నిర్మాణ కర్మాగారమతడు!! అందుకే రజాకారు మూకలు చందుపట్ల ఊరిబయట దేవులపల్లి గుడిసెను కాల్చివేస్తూ ”ఈ గుడిసెలోనే కమ్యూనిజం పుట్టిందిరా.. తనివితీరా కాల్చండిరా” అంటూ రాక్షసానందం పొందాయి.
దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైగా సాగిన దేవులపల్లి రాజకీయ జీవితంలో దాదాపు 22 ఏండ్లు రహస్యంగానో లేదా జైలులోనో గడిచింది.. పోరాట విరమణానంతరం 1957లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జీవిత చరమాంకం వరకు ప్రజా పోరాటాల్లో భాగమయ్యాడు. చాలామంది నాయకులు తాము పోరాడిన అనుభవాలను, ఘట్టాలను, ఉద్యమకాలంలో జరిగిన అనేకానేక సంఘటనలను గ్రంథస్థం చేయరు. దానితో ఆ చరిత్ర రాబోయే తరాలకు అందకుండాపోయే ప్రమాదం ఉండ డం ఒక ఎత్తైతే, ఆ చరిత్రను వక్రమార్గం పట్టించే శక్తులూ ఉంటాయి. నేడు బీజేపీ చేస్తున్న వాదన చూస్తున్నదే కదా. ఇప్పటికి సాయుధ పోరాటంపై ప్రామాణికమైన పుస్తకాలేమైనా ఉన్నాయంటే సుందరయ్య గారు రాసిన ”వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు” పుస్తకంతోపాటు దేవులపల్లి రాసిన ”తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర”. దాదాపు వీరు అనేక పుస్తకాల రూపేణా ఏడు వేల పేజీలకు పైగా సాహిత్యాన్ని అందించారు. అందుకే అతనెప్పుడు చరిత్ర పేజీల్లో అక్షరాలై మెరుస్తూనే ఉంటాడు! ఆరిపోని సిరామరకలై వెలుగులు పంచుతూనే ఉంటాడు.
– స్ఫూర్తి, 9490098694

Spread the love