బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ యువకుడు దుబాయ్ లో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు.ఈ సంఘటన శనివారం అలస్యంగా వెలుగు చూసింది. ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన సున్నం రమేష్ (30) బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ లోని దుబాయ్ కు వెళ్ళాడు. దుబాయ్ లో పని చేసుకుంటున్న సున్నం రమేష్ బాత్రూం లోకి స్నానానికి వెళ్లి స్నానం చేస్తుండగానే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు మృతుని స్నేహితులు తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు.శనివారం ఉదయం మృతుని తల్లి భారతి కి ఈ విషయం తెలియడంతో వారి కుటుంబం కన్నీటి పర్యంతం అవుతున్నారు. మృతుని తల్లి, సోదరులు విలపిస్తూ మృతుడు రమేష్ శవాన్ని స్వగ్రామానికి తిసుకుని వచ్చే విధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వీంద్, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని బాధిత కుటుంబ సభ్యులు,, గ్రామస్తులు కోరుతున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు విలపిస్తున్నారు.