చరిత్ర అనేది అన్ని సంఘటనలను, వ్యక్తులందర్నీ తనలో కలిపేసుకుంటూ పోతుంది. అందులో కొంతమంది పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడితే.. మరికొందరు తమకు తెలియకుండానే చరిత్రలో అలా అలా మిగిలిపోతుంటారు. ఇందుకు సంబంధించి మాజీ సీఎం కిరణ్‌కుమర్‌రెడ్డికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంతకుముందు ఏ మంత్రి పదవినీ చేపట్టకుండానే 2009లో ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారాయన. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం అప్పటి పరిస్థితుల రీత్యా కాంగ్రెస్ అధిష్టానం పెద్దాయన రోశయ్యను సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించటంతో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి అనుకోకుండా సీఎం అయ్యారు. అయితే అదే ఆయనకు చరిత్రలో ఎవరికీ లేని ఒక ప్రత్యేకతను ఆపాదించిపెట్టింది. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘రాష్ట్రం విడిపోయింది. సీఎం పదవి పోయింది… అయినా బాధలేదు. కానీ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనే పదం వినటానికే కష్టంగా ఉంది.. నేను చరిత్రలో ఇలా మిగలాల్సి రావటం నా దురదృష్టం…’ అంటూ ఆయన సన్నిహితుల వద్ద వాపోయేవారట. ఈ విషయాన్ని కాసింత సేపు పక్కనబెడితే… అప్పట్లో కిరణ్ కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి… ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… అటు తర్వాత బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఓ లీడర్ ఇటీవల ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయింది.. కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా ఆయన్ను చాలాసార్లు కలిశానంటూ ఆ ఎమ్మెల్యే చెప్పారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాత కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. ఆ పార్టీకి పాదరక్షల (చెప్పులు) గుర్తును ఎంచుకున్నారు. ఇదే నాకు గమ్మత్తుగా అనిపించింది. అన్నా… పార్టీ పెడితే పెట్టినవ్ గానీ, పోయి పోయిగా చెప్పు గుర్తును ఎందుకు ఎంచుకున్నవే…’ అని పలుమార్లు ఆయన్ను ఆటపట్టించానంటూ ఆ ప్రజా ప్రతినిధి చెప్పుకొచ్చారు. అలా అడిగిన ప్రతీసారీ… ‘అరెరు… ఆ పార్టీ గురించి, ఆ చెప్పుల గురించి గురించి వదిలేరు.. నన్ను కూడా వదిలేరు…’ అని కిరణ్ పక్కకుపోయే వారంటూ ఎమ్మెల్యే చెప్పేసరికి పాత్రికేయులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. -బి.వి.యన్.పద్మరాజు