– క్యాబినెట్ నిర్ణయాలు
– 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.22,500కోట్లు
– ఇరిగేషన్ అక్రమాలపై విచారణకు జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అర్హులందరికీ త్వరలో తెల్ల రేషన్ కార్డులందించాలని మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లతో నిర్మించేందుకు క్యాబినేట్ ఆమోద ముద్ర వేసింది. లబ్దిదారులను గ్రామసభల్లో ఎంపిక చేయనున్నట్టు మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు
విశ్రాంత న్యాయమూర్తులతో రెండు కమిటీలను నియమించింది. ప్రాజెక్టుల అవకతవకలపై విచారణ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వం వహిస్తారు. విద్యుత్ కొనుగోలు టెండర్ల అవకతవకలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఆయా అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి వంద రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నాయి. ముదిరాజ్, యాదవ, కురుమ, మున్నారుకాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఆర్యవైశ్య, రెడ్డి, మాదిగ, మాల, కొమురం భీం ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడి, ఏకలవ్య మొదలగు 16 కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించిందని పొంగులేటి తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్ చుట్టూ మహిళా రైతు బజార్ల ఏర్పాటు, స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా ఓఆర్‌ఆర్ పరిధిలో 25ఎకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వచ్చే మూడు రోజుల్లో 92శాతం రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
డ్వాక్రా మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో మహిళా శక్తి ప్రత్యేక పథకం తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్‌సిగల్ ఇచ్చింది. 2008 డీఎస్సీ అభ్యర్దులకు మినిమం పే స్కేలు ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించినట్టు పొంగులేటి వివరించారు. మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.