పరిచయం అవసరం లేని నటి రాధిక. వివిధ భాషల్లో నటించిన ప్రఖ్యాత నటీమణి. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల సరసన నటించిన ఘనత ఆమెది. నిండైన శరీర సౌష్టవంతో, సహజమైన నటనతో ఏ పాత్రలోనైనా ఇమిడిపోయి, గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం ఇచ్చే నటి. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 350కి పైగా చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. శక్తివంతమైన పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ప్రతిష్టాత్మకమైన ఎన్నో పురస్కారాలు అందుకుని ఇప్పటికీ సినిమాలు, టీవీ సిరియల్స్, వెబ్ సీరిస్‌లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
రాధిక అలనాటి ప్రముఖ తమిళ హాస్య నటుడు ఎం.ఆర్. రాధ, గీతల కూతురు. 1962, ఆగస్టులో ఈమె శ్రీలంకలో పుట్టారు. ఈమె తండ్రి చెన్నైకి చెందిన తెలుగు వారు. తల్లి శ్రీలంక తమిళియన్. రాధికకు చిన్నతనం నుండి సినిమాలంటే అమితమైన ఆసక్తి. ఈమె చదువంతా ఇండియా, శ్రీలంక, లండన్‌లో కొనసాగింది. రాధికకు ఓ చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చెల్లి నిరోష కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.2001లో ప్రముఖ నటుడు ఆర్.శతర్‌కుమార్‌ను రాధిక పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పెండ్లికి ముందు రెండు చిత్రాల్లో కలిసి నటించారు. అప్పుడు వీరి పరిచయం స్నేహంగా మారి అది పెండ్లికి దారితీసింది. ఈమెకు 1992లో రయానే అనే కూతురు, 2004లో రాహుల్ అనే కొడుకు జన్మించారు. రయానే 2016లో క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు.
తమిళంలో రంగ ప్రవేశం
సినిమాలపై ఉన్న ఇష్టంతో 16 ఏండ్ల వయసులో రాధిక చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1978లో భారతీరాజా దర్శకత్వంలో కిజక్కే పోగుమ్ రైల్‌లో అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆమె హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాలలో నటించారు. ఆమె మీండుమ్ ఒరు కాతల్ కథై(1985) అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇది దర్శకత్వంలో ఉత్తమ తొలి చిత్రంగా ఇందిరా గాంధి అవార్డును గెలుచుకుంది.
తొలి చిత్రానికే ఉత్తమ నటిగా…
తెలుగులో రాధిక తొలి చిత్రం ‘న్యాయం కావాలి'(1981). ఈ చిత్రం ప్రేమించిన వ్యక్తిచే మోసగింపపడి, అతనికి ఎలాగైనా తగిన పాఠం నేర్పాలనే ఉద్దేశంతో కొనసాగే కథ. అప్పట్లో ఈ చిత్రం ఓ సంచలనం. తెలుగులో తొలి సినిమా అయినప్పటికీ తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో అఖండ విజయాన్ని సాధించిన ‘స్వాతి ముత్యం’లో చిన్న వయసులోనే భర్తను కోల్పోయి బిడ్డతో జీవితం సాగిస్తున్న ఒంటరి మహిళ పాత్రలో ఆమె, అమాయకపు పాత్రలో కనిపించే కమలహాసన్‌ను పెండ్లి చేసుకుని అతనిని తీర్చి దిద్దిన వైనం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. ఎన్ని సార్లు చూసినా చూడలనిపించే ఆమె నటనకు ఈ చిత్రం నిదర్శనం.
విభిన్నంగా చేయాలని…
సినిమాల్లో విజయం సాధించిన తర్వాత రాధిక ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నారు. అందుకని బుల్లితెరలో నటన ప్రారంభించారు. అయితే చాలామంది ఆమె నిర్ణయం సరైనది కాదన్నారు. ఆమె కూడా మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ తన సొంత బ్యానర్‌తో టెలివిజన్ ధారావాహికలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1994లో రాడాన్ మీడియావర్క్స్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదుర్కొనా 1999లో పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీగా తిరిగి రాడాన్ మీడియావర్క్స్ లిమిటెడ్‌గా ఆవిర్భవించింది. ఆమె విజరు టీవీ జోడీ నంబర్ వన్ సీజన్ 4లో న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు.
మార్పే ముందుకు తీసుకెళ్తుంది
ఇక సినిమా విషయానికి వస్తే షూటింగ్ వాతావరణమే చాలా ప్లజంట్‌గా ఉండేదని, వారి రోజుల్లో క్యారీవ్యాన్ ఉండేది కాదని, అందరూ ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేసే వారని అప్పుడప్పుడు ఆమె ఇంటర్వ్యూలో పంచుకుంటుంటారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి 350కి పైగా చిత్రాల్లో నటించిన రాధిక అప్పటికీ, ఇప్పటికీ మేకింగ్ పరంగా ఎన్నో చేంజెస్ వచ్చాయని టెక్నాలజీ, నాలెడ్జి అంతా మారిపోయిందనీ, ఎప్పటికైనా మార్పే ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్, కొత్త ఆర్టిస్టులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. కొత్త తరం నటులు వారి టాలెంట్‌తో ముందుకు వస్తున్నారని, వారిని చూస్తే చాలా సంతోషంగా ఉందని ఆమె పంచుకుంటున్నారు.
కథ మంచిదైతే చాలు…
ఎప్పటికీ తాను ఓ నటిగానే ఉంటానంటున్నారు. ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తానని, తెలుగు సినిమా అంటే తనకు ప్యాషన్ అంటున్నారు. తెలుగు సినిమాల్లో నటించడం అంటే ఆమెకు చాలా ఇష్టమట. మంచి కథ ఉంటే తప్పక తెలుగులో నటించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఆమె నటించిన అభిలాష, దొంగమొగుడు, మూడు ముళ్ళు, సూర్య వంశం మొదలైన చిత్రాలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంటాయి. ఇన్ని చిత్రాల్లో నటించిన రాధిక ఆరు నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, ఓ నేషనల్ అవార్డ్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఒక సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డుతో పాటు నంది అవార్డును అందుకున్నారు.
– పాలపర్తి సంధ్యారాణి