నవతెలంగాణ-హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ తన ఆటతో మరోసారి రికార్డు సృష్టించాడు. కొన్నాళ్లుగా చిరాగ్ షెట్టితో కలిసి సంచలన ఆటతీరు కనబరుస్తున్న సాత్విక్ కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లోనూ తొలిసారి విజేతగా నిలిచాడు. పురుషుల డబుల్స్ లో సాత్విక్, చిరాగ్ జోడీ.. ప్రపంచ నంబర్ వన్ జంట అల్పియాన్ -అర్డినాంటోతో వీరోచితంగా పోరాడి విజయం సాధించింది. ఫైనల్లో మూడో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ జంట 17–21, 21–13, 21–14తో ఇండోనేసియాకు చెందిన టాప్ సీడ్ జంటను ఓడించింది. తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ తర్వాతి రెండు గేమ్స్‌లో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. సాత్విక్–చిరాగ్ కెరీర్‌లో ఇది మూడో సూపర్500 టైటిల్ కావడం విశేషం. ఇదివరకు థాయిలాండ్ ఓపెన్ (2019), ఇండియా ఓపెన్ (2022) గెలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో స్విస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్ గెలిచిన అతను ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.