ప్రజాస్వామ్య దేవాలయం

– పార్లమెంట్‌ కొత్త భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
దేశ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోడీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. లోక్‌సభలోకి ప్రవేశించగానే ఎంపీలు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇస్తూ.. చప్పట్ల మధ్య మోడీకి ఆహ్వానం పలికారు. తమిళనాడు ఆధీనమ్‌ల మఠాధిపతులు పాల్గొన్నారు. సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఆసనం సమీపంలో ప్రతిష్ఠించడానికి ముందు, ఆ రాజదండాన్ని చేతిలో ధరించి, ఆధీనమ్‌ల ఆశీర్వాదాలను మోడీ స్వీకరించారు. వారు ఆయనపై అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. ఆ రాజదండానికి మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్త పార్లమెంట్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం సర్వమత ప్రార్థనలు జరిగాయి.

రూ.75 నాణేన్ని ఆవిష్కరించిన మోడీ
కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ విడుదల చేశారు. ఈ నాణానికి ఒకవైపు అశోక స్తంభంలోని సింహ తలాటం, దానికి దిగువన ‘సత్యమేవ జయతే’ అక్షరాలు ఉంటాయి. ఎడమ వైపున దేవనాగరి లిపిలో ‘భారత్‌’ అని, కుడివైపున ‘ఇండియా’ అని ఆంగ్లంలో రాసి ఉంటుంది. అలాగే దిగువన నాణెం విలువ అయిన 75 ముద్రించి ఉంటుంది. నాణానికి మరోవైపు పార్లమెంట్‌ భవన సముదాయం ముద్రించి ఉంటుంది. దీనికి పైన.. సంసద్‌ సంకుల్‌ అని దేవనాగరి లిపిలో..దిగువన పార్లమెంటు కాంప్లెక్స్‌.. అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.
వెళ్లకపోవడమే మంచిదైంది
 అక్కడి పరిస్థితులు బాధ కలిగించాయి : శరద్‌పవార్‌
పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ పరిస్థితులపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ”ఉదయం కార్యక్రమాన్ని చూశాను. అక్కడికి (ప్రారంభోత్సవ కార్యక్రమానికి) వెళ్లకపోవడమే మంచిదైంది. అక్కడ జరిగిందంతా చూసిన తర్వాత నాకు బాధ కలిగింది. మనం దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నామా? ఈ కార్యక్రమం పరిమిత వ్యక్తుల కోసమేనా?” అని శరద్‌ పవార్‌ ప్రశ్నించారు.
భారత నిబద్ధతకు
సజీవ ఉదాహరణ : రాష్ట్రపతి
కొత్త పార్లమెంటు భవనం తన ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపా డుకోవడంలో భారత నిబద్ధతకు సజీవ ఉదాహరణ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రధాని మోడీ చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడాన్ని ఆమె స్వాగతించారు. ఈ మేరకు రాష్ట్రపతి పంపిన రాతపూర్వక సందేశాన్ని పార్లమెంటు
భవన ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ చదివి వినిపించారు. ప్రధానమంత్రి కార్యాలయం సభలోని ‘విశ్వాసానికి’ ప్రాతినిధ్యం వహిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అయితే, ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరుకాకపోవడంతో ప్రతిపక్షాలు ఈ వేడుకను బహిష్కరించటం గమనార్హం.

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన అనంతరం తొలి ప్రసంగం చేశారు. ప్రతి దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ కొన్ని సమయాలు వస్తూ ఉంటాయని, అవి అమరత్వం పొంది శాశ్వతంగా నిలిచిపోతాయని, అటువంటి రోజే మే 28 అని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ సువర్ణ ఘడియల సందర్భంగా భారతీయులందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. ఈ అమృత మహౌత్సవంలో భారతీయులు తమ ప్రజాస్వామ్యానికి ఈ నూతన పార్లమెంట్‌ భవనాన్ని బహూకరించుకున్నారని అన్నారు.
ఈ నూతన పార్లమెంట్‌ కేవలం ఓ భవనం కాదన్నారు. ఇది కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. పాత, కొత్తల మేళవింపుతో ఈ భవనాన్ని నిర్మించామ న్నారు. నవ భారతం కొత్త పంథాలో దూసుకెళ్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందడమంటే, ప్రపంచ అభివృద్ధికి దోహదపడటమని తెలిపారు. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రజాస్వామ్య దేవాలయమని పేర్కొన్నారు. ప్రపంచమంతా దేశంవైపు ఆసక్తిగా చూస్తోందన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనం దేశ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. ప్రపంచానికి దేశం ధృఢ సంకల్పంతో సందేశాన్ని ఇస్తోందన్నారు.
ఎంపీల సంఖ్య పెరుగుదలకనుగుణంగా పార్లమెంట్‌
రానున్న కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని ప్రధాని మోడీ చెప్పారు. పాత పార్లమెంట్‌ భవనంలో అనేక ఇబ్బందులు ఉండేవని, సభ్యులు కూర్చోవడానికే కాకుండా, సాంకేతిక సమస్యలు కూడా ఉండేవని చెప్పారు. రాబోయే కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగినట్టుగానే నూతన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించామని చెప్పారు. కొత్త భవనంలో ఆధునిక వసతులు ఉన్నాయని చెప్పారు. నూతన పార్లమెంట్‌ భవనం సాధికారత, రగిలే స్వప్నాలకు కేంద్రంగా నిలవాలని, జ్వలించే స్వప్నాలు సాకారమయ్యేలా చేసే చోటుగా విలసిల్లాలని మోడీ ఆకాంక్షించారు.
నవ భారతం బానిసత్వపు మనస్తత్వాన్ని విడిచిపెట్టింది
స్వాతంత్య్రం సిద్ధించిన అమృతకాలం అనంతమైన కలలను, అసంఖ్యాకమైన ప్రజాస్వామ్య దేవాలయం ఆకాంక్షలను నెరవేర్చే అమృతకాలమని తెలిపారు. 21వ శతాబ్దపు నవ భారతం సమున్నత స్థాయి ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. బానిసత్వపు మనస్తత్వాన్ని విడిచిపెట్టిందన్నారు. ఈ కృషికి సజీవ చిహ్నంగా నూతన పార్లమెంట్‌ భవనం నిలుస్తోందన్నారు. సావర్కర్‌ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు.
ప్రతి భారతీయునికి గర్వకారణం
నూతన పార్లమెంట్‌ భవనానికి వారసత్వ, వాస్తు శిల్ప ఘనత ఉన్నాయని చెప్పారు. దీనిలో కళతోపాటు నైపుణ్యం కూడా ఉందని చెప్పారు. దీనిలో సంస్కృతి, సంప్రదాయాలతోపాటు రాజ్యాంగ గళం కూడా మిళితమైందని తెలిపారు. రానున్న 25 ఏండ్లలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఈ పాతికేండ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నారు. విజయం సాధించాలంటే తొలి షరతు విజయవంతమవుతామనే నమ్మకం ఉండటమేనని చెప్పారు. ఈ నూతన పార్లమెంట్‌ భవనం ఈ నమ్మకాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో ఇది నూతన ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి భారతీయుడి కర్తవ్య భావాన్ని మేలుకొలుపుతుందని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ ఈ అమృత ఘడియల్లో దేశ ప్రతిష్ట పెరిగిందని, మన బలమైన భవిష్యత్తుకు ప్రజాస్వామ్యమే పునాది అని అన్నారు. అంతర్గత, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం మన పార్లమెంట్‌కు ఉందన్నారు. కొత్త పార్లమెంట్‌లో కొత్త ఆలోచనలు, మంచి సూత్రాలతో ముందుకు వెళ్దామని అన్నారు. మోడీ సారథ్యంలో రెండున్నరేళ్లలో కొత్త పార్లమెంటు నిర్మించడం చాలా సంతోషకరమని, ఇది ఒక మైలురాయి అని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.వీరితో పాటు ఎంపీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్లమెంట్‌ హాలులో సావర్కర్‌కు నివాళులు
కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం రోజు విడి సావర్కర్‌ జయంతి సందర్భంగా పాత పార్లమెంట్‌లోని సెంట్రల్‌ హాలులో సావర్కర్‌ చిత్రపటానికి ప్రధాని మోడీ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. మోడీతో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love