– వచ్చే మూడు నెలలు ప్రసారం కాదు : ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాని మోడీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే మూడు నెలలు ప్రసారం కాదని మోడీ స్వయంగా వెల్లడించారు. మన్ కీ బాత్ 110 వ ఎపిసోడ్‌లో మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆదివారం ఉదయం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వచ్చే మూడు నెలల పాటు మన్ కీ బాత్ ప్రసారాలు ఉండవు’ అని ప్రకటించారు. ఎన్నికల అనంతరం ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘మన్ కీ బాత్ మూడు నెలల పాటు ఆగిపోవచ్చు. కానీ దేశం సాధించిన విజయాలు మాత్రం ఆగవు. అందువల్ల మన్ కీ బాత్ హ్యాష్‌ట్యాగ్‌తో సమాజం, దేశం సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండండి’ అని తన 110 వ ఎపిసోడ్‌లో మోడీ తెలిపారు. ఎన్నికల అనంతరం 111వ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని వెల్లడించారు.