పదేండ్ల ట్రైలర్‌..!

Sampadakiyam మోడీ ‘వికసిత్‌ భారత్‌’ పర్యటన మూడు రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌ చేరుకుంది. మీరట్‌లో జరిగిన సభలో ‘ఇప్పటి వరకు దేశ ప్రజలు చూసిన అభివృద్ధి కేవలం ట్రైలరే. రాబోయే ఐదేండ్లలో మొత్తం సినిమా చూపిస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. మరో సారి అధికారం ఇస్తే ఈ పదేండ్లలో సాధించిన దానికంటే దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తానని ఇంకాస్త విఫులంగా చెప్పుకొచ్చారు. దాని కోసం తన ప్రభుత్వం ఓ రోడ్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేసుకుందని చెప్పారు. ఈ పదేండ్ల ట్రైలర్‌కే సామన్యులు విలవిల్లాడుతున్నారు. విద్వేష విధ్వంసమూ సాగుతోంది. ఇక సినిమా మొత్తం చూపిస్తే ఏమవుతుందో ఆందోళన కలిగించే అంశమే.
మోడీ వెలగబెట్టిన ఈ పదేండ్ల పాలనలో ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందనేది పచ్చినిజం. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి పూట కూడా గడవని స్థితికి ప్రజలు చేరుకున్నారని, పేదరికాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని చెబుతున్న లెక్కలు సత్యం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానంటూ యువతను బుట్టలో వేసుకున్న మోడీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకారనేది వాస్తవం. ఒకే దేశం ఒకే పన్ను అంటూ జీఎస్టీ తెచ్చి సామాన్యులపై మోయలేని భారం మోపారు. అలాగే నల్లధనాన్ని రూపుమాడమే తన లక్ష్యంగా చెప్పుకుంటూ పెద్ద నోట్లను హడావుడిగా రద్దు చేసి కార్పొరేట్లకు లాభం చేకూర్చారు. ఇదే విషయాన్ని నిన్నకాక మొన్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న కూడా గుర్తుచేశారు. గవర్నర్లను ఉపయోగించుకొని రాష్ట్రాల హక్కులను కాలరాయచూశారు. ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి ప్రభుత్వాలనూ మార్చేసారు. తమ మతోన్మాద విధానాలను యథేచ్ఛగా అమలు చేసుకునేందుకు రాజ్యాంగాన్నే తిరగరాస్తామంటున్నారు. ఇదంతా ఈ పదేండ్ల ట్రైలర్‌లో మోడీ సాధించిన ఘన చరిత్ర కాదా!
ఇక తనది రైతు రాజ్యమంటూ గొప్పలు చెబుతూ వ్యవసాయరంగంలో కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌ పరిచేందుకు మూడు నల్ల చట్టాలను తెచ్చిన మోడీ మోసాన్ని కర్షకులు ఎప్పటికీ మర్చిపోరు. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న గొప్ప చరిత్రా ఈ ట్రయలర్‌ కాలంలోదే. అన్నదాతల పోరాట పటిమకు చివరకు దిగిరాక తప్పలేదు. అలాగే కార్మిక చట్టాలను కాలరాస్తూ నిర్ణయాలు తీసుకుంటే వారూ తిరగబడ్డారు. నూతన విద్యావిధానం తెచ్చి పేదలకు విద్యను దూరం చేసే కుట్రలు పన్నితే విద్యార్థులు ఎలా మర్చిపోతారు?
‘బేటీ బచావో – బేటీ పడావో’ నినాదం మన ప్రధానికి కొట్టిన పిండైపోయింది. అయితే చిన్నారి ఆసిఫాపై లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గులకు ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే అండగా నిలిచిన విషయం మహిళా లోకం ఇంకా మర్చిపోలేదు. దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్లు నడిరోడ్డుపై బోరున విలపించిన దృశ్యం ఇంకా ప్రజల కండ్లల్లో మెదులుతూనే ఉంది. బిల్కిస్‌ బానోపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నేరస్తులను స్వేచ్ఛగా వదిలేస్తే కోర్టు మొట్టికాయలు వేసిన సంగతి దేశం ఎలా మర్చిపోతుంది? ఇవన్నీ మోడీ ట్రైలర్‌లో జరిగిన దుర్మార్గాలు కాదా..! ఇక మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసిన ఘటనను ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. ఇవన్నీ ఆయనగారి పదేండ్ల ట్రైలర్‌ పాలనలో జరిగిన నీచమైన చర్యలే కదా!
కార్మికులు, కర్షకులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా అందరూ గత పదేండ్ల నుంచి పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా లౌకిక రాజ్యమని చెప్పుకుంటున్న మన దేశంలో మైనార్టీలు అభద్రతా భావంలో బతుకుతున్నారు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీస్తున్నారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని రుజువు చేసుకొమ్మంటున్నారు. ట్రైలర్‌లోనే తమ బతుకులు ఇలా ఉంటే ఇక మొత్తం సినిమా మొదలైతే తమ పరిస్థితి ఇంకెంతగా దిగజారి పోతుందో అనే సందేహం రావడం సహజం.
ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో మోడీ గుండెల్లో గుబులు మొదలైంది. తన దుర్మార్గపు ట్రైలర్‌ పాలన నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎత్తులు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ దాడులకు తెగబడ్డారు. ఈడిని అడ్డుపెట్టుకొని తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తనకు అడ్డు లేకుండా చేసుకునేందుకు ప్రతిపక్ష నేతలను జైళ్ళకు పంపిస్తున్నారు. అవినీతికి పాల్పడింది ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునేం దుకు తన ప్రభుత్వం వెనకాడే ప్రసక్తే లేదని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. మరి ఆ అవినీతిపరులే తన కమలం గూటికి చేరితే మాత్రం విచిత్రంగా శుద్ధపూసలైపోతున్నారు. అందుకే మోడీ ట్రైలర్‌ పాలనలో జరిగిన పాపాల చిట్టాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తాము స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే హక్కును కూడా కోల్పోతామనే నిజాన్ని గ్రహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీని ఓడించి అసలు ప్రజా సినిమా చూపించేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు.

Spread the love