నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల మాత్రం ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల ఏకంగా పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ అవ్వడం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని అపహరించారు. వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం నుంచి ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో పాటు ఈవీఎంలు ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నడికుడిలో వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. టీడీపీ నేత నెల్లూరు రామకోటయ్యపై దాడికి తెగబడ్డారు. ఇలా ఏపీలో పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్లు బోటులో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కూడేరే పోలింగ్ కేంద్రానికి పి.గన్నవరం పరిధి లంకల గన్నవరానికి చెందిన ఓటర్లు బోటులో వెళ్లారు.