– నిరసన దీక్షకు అనుమతిచ్చినా బండి ఓవరాక్షన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనీ, మంత్రి కేటీఆర్‌ను మంత్రిమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు(తెలంగాణ అమరవీరుల స్తూపం) వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. వాస్తవానికి ఆయన గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి తన నిరసన దీక్షను బీజేపీ కార్యాలయంలో చేపడతానని గురువారం ప్రకటించారు. శుక్రవారం ఆయన బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి బీజేపీ ఆఫీసు నుంచి గన్‌పార్కు వరకు పాదయాత్రగా వెళ్లారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడే దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. అనుమతి లేదని పోలీసులు వారించారు. అయినా, బండి మొండిపట్టు పట్టడంతో పోలీసులు ఓకే చెప్పారు. నిరసన దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడే సమయంలో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్లబోతున్నట్టు బండి సంజరు ప్రకటించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు బండి, ఈటల రాజేందర్, పలువురు నేతలను అరెస్టు చేశారు. వారిని తరలించకుండా బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైటాయించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై మఫ్టీలోని పోలీసులు తమ ప్రతాపాన్ని చూపుతూ తోసేశారు. ఈ క్రమంలోనే సాక్షి ఫొటోగ్రాఫర్ రాజేశ్, వెలుగు ఫొటోగ్రాఫర్ సురేశ్‌రెడ్డిలతో పాటు నలుగురు కెమెరామెన్‌లు గాయాలపాలయ్యారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరామెన్‌లపై మఫ్టీలోని పోలీసులు దాడి చేయడాన్ని టీడబ్ల్యూజేఎఫ్ ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడులకు పాల్పడటం సరిగాదని పేర్కొన్నారు.