వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఉద్రిక్తత

Warangal Municipal Tension at the corporation– హామీలను అమలు చేయాలంటూ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్‌
– నాయకుల ముందస్తు అరెస్ట్‌
– ముఖ్య నాయకుల గృహనిర్బంధం
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌, హనుమకొండ జిల్లాల నాయకులు కార్పొరేషన్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఉదయమే పోలీసులు నాయకులను ముందస్తుగా ఇండ్ల వద్దనే నిర్బంధించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తదితర ముఖ్య నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు.
పోలీసుల నిర్బంధం నుంచి కొందరు కాంగ్రెస్‌ శ్రేణులు తప్పించుకొని రోడ్ల మీదికి వచ్చారు. పోలీసులు వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌ ఆధ్వర్యంలో ఎంజీఎం సర్కిల్‌లో భారీరీకేడ్లను ఏర్పాటు చేశారు. ఇంతేజార్‌గంజ్‌ సీఐ శ్రీనివాస్‌, మెట్టవాడ సీఐ ఎన్‌ వెంకటేశ్వర్లు, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైపు ఎవరినీ అనుమతించలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముట్టడికి అనుమతి లేని కారణంగా గుంపులుగా ఎవరూ ఆందోళన చేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్‌ ఆధ్వర్యంలో హనుమకొండ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గల కాంగ్రెస్‌ శ్రేణులు వరంగల్‌ ఎంజీఎం, రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ బారీకేడ్లను దాటుకొని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఏసీపీ బోనాల కిషన్‌, కాజీపేట ఏసీపీ డేవిడ్‌తో కలిసి సీఐలు కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డగించారు. దీంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట, వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ఆందోళన చేయడానికి వస్తే అడ్డగించారని, ఇది దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్‌ వాహనాల్లోకి ఎక్కించి మామనూరు పోలిస్‌ ట్రెయినింగ్‌ కళాశాలకు తరలించారు.
అలాగే, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముట్టడికి బయలుదేరిన వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులు మాజీ ఎస్పీ నాగరాజు బల్దియా కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేసి పోలిస్‌ స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌ మున్సిపల్‌నగర్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలతో ముంపునకు గురైన ప్రజలను తక్షణమే ఆదుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ముట్టడి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామునే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పర్వతగిరి మండలంలో కిసాన్‌ కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌ రావును హౌస్‌ అరెస్టు చేశారు. ఖానాపురం, వేలేరు మండల కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేశారు.

Spread the love