– ఎన్నికల్లో టికెట్లకు తీవ్ర పోటీ
– తమ సీటుకే ఎసరు రావడంతో లబోదిబో
– పలు వివాదాల్లో సిట్టింగ్‌లు
నవతెలంగాణ-హనుమకొండ
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అధికారిక పార్టీలో ఎమ్మెల్సీలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు- ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో, భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి మాజీ శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారితో, మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు- ఎమ్మెల్సీ, మంత్రి సత్యవతి రాథోడ్‌తో టికెట్ల పోటీ ఏర్పడింది. వారి వల్ల సిట్టింగ్‌లు తమ సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది.
ఈనెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ మొదటి లిస్టును ప్రకటిస్తున్నారని వాటి వివరాలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేదా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి, భూపాలపల్లిలో మధుసూదనాచారికి, మహబూబాబాద్‌లో సత్యవతి రాథోడ్ కు టికెట్లు కేటాయించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ వస్తుందో రాదో అని కేసీఆర్ మొదటి జాబితా ప్రకటించేంతవరకు సిట్టింగులకు నిద్ర పట్టడం లేదు.
వివాదాలే కొంప ముంచుతున్నాయా..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లు ఇస్తామని, ఒళ్లు దగ్గర పెట్టుకుని వివాదాలకు దూరంగా ఉండి.. ప్రజల మధ్యలో పనిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ పదేపదే చెప్పినా పెడచెవిన పెట్టడం వల్లే వారికి ఈ పరిస్థితి వచ్చిందని పలువురు బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ప్రధానంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ గత ఎన్నికల్లో కూడా చివరి దశలో టికెట్లు దక్కించుకున్నారు. ఈసారి కూడా వారు ప్రమాదంలో పడటానికి కారణం వారి స్వయం కృపరాధమేనని తెలుస్తోంది.
ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాల్లో కూరుకుపోయారు. ఈసారి స్వయానా ఆయన కూతురే తండ్రికి టికెట్ ఇస్తే తానేే నిలబడి ఓడిస్తానని బాహాటంగా ప్రకటించారు. తాటికొండ రాజయ్య దళితబంధు స్కీంలో కమీషన్లు తీసుకుంటున్నారని స్వయానా అధినేత కేసీఆర్ హెచ్చరించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. నారాయణగిరి సర్పంచ్ నవ్య రూపంలో మరో పెద్ద వివాదంలో చిక్కుకొని చేజేతులా ప్రమాదంలో పడ్డారు.
మహబూబాబాద్‌లో శంకర్‌నాయక్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేరు ఉంది. గతంలో ఒక ఐఏఎస్ మహిళా అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు ఒక సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా బహిరంగంగానే మైకు గుంజుకొని అధినేత దృష్టిలో పడ్డారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు మీడియాలో వచ్చాయి.