పూణెలో ఉద్రిక్తత.. భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్

నవతెలంగాణ -మహారాష్ట్ర: పూణె లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పూణె నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలండి పట్టణంలో గల శ్రీక్షేత్ర ఆలయంలోని ఓ వేడుక కోసం భక్తులు ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కాగా, శ్రీకృష్ణుడి రూపమైన విఠోబా భక్తులు రాష్ట్రంలో పోలీసుల చర్యకు గురికావడం ఇదే తొలిసారి. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులను నియంత్రించేందుకు లాఠీఛార్జ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆలయంలోకి 75 మందిని మాత్రమే అనుమతించాలని నిబంధనలు ఉండగా.. 400 మంది బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించారని ఆరోపించారు. దీంతో వారిని నియంత్రించేందుకు లాఠీఛార్జ్ చేసినట్లు వారు పేర్కొన్నారు.  అయితే, భక్తులపై లాఠీఛార్జ్ ఆరోపణలను ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  ఖండించారు. వార్కారీ కమ్యూనిటీపై ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదని నాగ్ పూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘గతేడాది ఇదే ప్రదేశం (అలండీ)లో జరిగిన తొక్కిసలాట లాంటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. అందుకే తీర్థయాత్రలో పాల్గొనే భక్తులకు తక్కువ స్థాయిలో ఎంట్రీ పాసులు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ప్రతి బృందానికీ 75 పాసులు మాత్రమే జారీ చేయాలని నిర్ణయించాం’ అని ఫడ్నవీస్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Spread the love