సూర్యాపేటలో ఉద్రిక్తత

– కౌన్సిలర్ల మధ్య తలెత్తిన ఘర్షణ
– 45 వ వార్డు కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా కు దిగిన అసమ్మతి కౌన్సిలర్లు
– ఇంటిపై చెప్పులు, కోడి గుడ్ల తో దాడి,
– పరస్పరం బాహాబహి కి దిగిన ఇరు వర్గాల  కౌన్సిలర్లు
– పోలీసుల ముందే ముష్టి యుద్దానికి పాల్పడ్డ కౌన్సిలర్ లు
నవతెలంగాణ – సూర్యాపేట
అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు  వ్యతిరేకించిన కౌన్సిలర్స్ మధ్యన జరిగిన పరస్పర దాడులు, తోపులాటలు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. దాదాపుగా రెండు గంటలకు పైగా ఇరు వర్గాల మధ్య బాహాబహి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బి.ఆర్.యస్ పార్టీలకు చెందిన నాయకులు, కౌన్సిలర్లు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి.ఈ క్రమంలో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం పెన్ సవాల్ గా మారింది.ఆదివారం మధ్యాహ్నం స్థానిక 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ నివాసం ఎదుట జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…. మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ,వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ లపై అవిశ్వాసా  తీర్మానంపై తిరుగుబాటు కౌన్సిలర్లు 16 మందితో పాటు కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి లకు చెందిన 16 మందితో కలిపి 32 మంది సంతకం పెట్టి కలెక్టర్ కు నోటీస్ ఇవ్వడం తెల్సిందే.కాగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ చివరి క్షణంలో హ్యాండ్ ఇవ్వడం తో అవిశ్వాసం వీగిపోయిన విషయం తెల్సిందే. ఈ ఎపిసోడ్ తర్వాత అసమ్మతి కౌన్సిలర్లు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పావని కృపాకర్ ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అసమ్మతి కౌన్సిలర్లు మూకుమ్మడిగా పావని నివాసానికి చేరుకున్నారు. నమ్మించి గొంతు కోసిన పావని కృపాకర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు గెట్ తోసుకుని ఇంట్లోకి చొరబడి కోడి గ్రుడ్లు,చెప్పులు,మట్టితో దాడి చేశారు.ఈ సమయంలో కౌన్సిలర్ పావని ఇంట్లో నే వున్నారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ నాగేశ్వరరావు, సిఐ రాజశేఖర్ లు సిబ్బంది తో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అసమ్మతి కౌన్సిలర్లు నినాదాలు చేస్తూ ఇంటి ముందు ధర్నా చేపట్టారు.ఇదే సందర్భంగా పావని కి మద్దతు గా చైర్ పర్సన్ అన్నపూర్ణ తో పాటు వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, బి.ఆర్.యస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్కడి కి చేరుకున్నారు. వారి రాకతో  అసమ్మతి కౌన్సిలర్ల ఆందోళన పెరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడి కి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.దీంతో కోపోద్రిక్తులై పరస్పరం ఇరు వర్గాల కౌన్సిలర్లు దాడి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులు చక్కదిద్ది ఇరువర్గాలను చెదరగొట్టారు.ఈ సందర్భంగా అసమ్మతి వర్గం చైర్మన్ అభ్యర్థి కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి తలకు స్వల్ప గాయమైంది.ఛైర్మన్ అన్నపూర్ణ దాడి చేసిందంటూ నిఖిల ఆరోపించారు. దమ్ముంటే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దళిత వ్యక్తి కి టిక్కెట్ ఇస్తే తాము గెలిపించుకుంటామని సవాల్ విసిరారు.కాగా గాయపడిన నిఖిల దిలిప్ రెడ్డి ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ మాజీమంత్రి దామోదర్ రెడ్డి ఆమెని పరామర్శించారు. తాను ఉన్నానంటూ ఆమెకు ధైర్యం చెప్పారు.ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో బారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు.చైర్మన్ పదవి ఇవ్వనందుకే గైర్హాజరు కావడం జరిగిందని 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు.అగ్ర వర్ణాలకు కాకుండా బిసి,బహుజనులకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరగా దీన్ని వారు వ్యతిరేకించారని ఆమె ఆరోపించారు. అందుకే మద్దతు ఇవ్వలేదని అన్నారు. అదేవిధంగా ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని పేర్కొన్నారు.త్వరలోనే బిఎస్పీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతామని ఆమె తెలిపారు.
Spread the love