– ముఖ్యమంత్రిపై పెరిగిన పని ఒత్తిడి
– కీలక శాఖలన్నీ ఆయన వద్దే
– క్యాబినెట్ విస్తరణను అడ్డుకుంటున్నదెవరు?
– పది నెలలుగా ఊరిస్తున్న అధిష్టానం
– పార్టీలో పెరుగుతున్న పోటీ
– ఆశావహుల్లో ఉత్కంఠ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాపాలనను సమర్థవంతంగా ప్రజలకు అందించే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతున్నది. కీలక శాఖలన్నీ ఆయన వద్దే ఉండటంతో వాటిపై సమీక్షలు నిర్వహించాల్సి వస్తున్నది. అంతే కాకుండా ఏ మంత్రికి కేటాయించని ముఖ్యమైన శాఖలు కూడా సీఎం దగ్గరే ఉన్నాయి. ప్రజాబాహుళ్యానికి అత్యంత కీలకమైన శాఖలను రేవంత్ పర్యవేక్షించాల్సి వస్తున్నది. ముఖ్యంగా హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, శాంతిభద్రతలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, విద్యాశాఖ, కార్మిక శాఖతోపాటు మంత్రులకు కేటాయించని శాఖలన్నింటినీ ముఖ్యమంత్రి సమన్వయం చేయాల్సి వస్తున్నది. దీంతో పాలన నిర్వహణ, సమీక్షలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయడం, వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేయటం, అభివృద్ధి పనులను వేగవంతం చేయటంపై ఇది ప్రభావం చూపిస్తున్నది. ఎన్నికల హామీ మేరకు ఆయా శాఖల్లో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సి ఉన్నది. కానీ ఆ మార్పులు ఇంకా మొదలు కావడం లేదు. రోజువారీగా పాలనా నిర్వహణ తప్ప ఆయా శాఖల్లో కొత్త కొత్త పథకాలను అమలు చేయడం లేదనే చెప్పొచ్చు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో ఆర్థిక నిర్వహణ కూడా పెద్ద సవాల్‌గా మారుతున్నది. ఇప్పటికే రైతు భరోసా ఆలస్యం కావడంతో అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు కనిపించడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమం నత్తనడకన సాగుతోన్నది. వీటిన్నింటిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలంటే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పది నెలలైనా కార్యరూపమేది?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మీడియాలో మంత్రివర్గ విస్తరణపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అదిగో మంత్రివర్గ విస్తరణ, ఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ బ్రేకింగులు, స్క్రోలింగ్‌లు వస్తున్నాయి. అవన్నీ మీడియాలో చూసి ఆశావహులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో క్యాబినెట్ విస్తరణపై చర్చ పాత చింతకాయ పచ్చడిలా తయారైందని రాజకీయ వ్యాఖ్యాతలు సెటైర్లు వేస్తున్నారు. మంత్రులను నియమించడంలో ముఖ్యమంత్రికి విచక్షణాధికారాలు ఉన్నప్పటికీ ఇందులో పార్టీ అధిష్టానం కీ రోల్‌గా మారింది.
ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు సహచర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడి అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉంది. మన అసెంబ్ల్లీలో సంఖ్యాబలం ఆధారంగా శాసనసభ్యుల్లో 15 శాతం మంత్రులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం సీఎంతోసహా 18 మంది మంత్రులు ఉండాలి. కానీ ప్రస్తుతం 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నది. పది ఉమ్మడి జిల్లాల్లో ఆరు జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు బెర్తులు దక్కలేదు. ఆయా జిల్లాలకు క్యాబినెట్‌లో స్థానం కల్పిస్తేగానీ సీఎంపై పని ఒత్తిడి తగ్గే అవకాశం లేదు. తలా ఓ శాఖను అప్పగించడం ద్వారా ఆయన తనపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా ప్రజాపాలనను ప్రజల దగ్గరికి చేర్చేందుకు మార్గం సుగమమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బ్రేకింగులు, స్క్రోలింగులే…
మంత్రిపదవి కోసం పార్టీ నేతల్లో పోటీ కూడా విపరీతంగా ఉన్నది. దీంతోపాటు సామాజిక సమీకరణాలు కూడా పార్టీకి సవాల్‌గా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టనున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీల్లో కొన్ని (ముదిరాజ్, యాదవ, రజక) కులాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మంత్రులు కూడా ఫలాన వారికి అవకాశం ఇవ్వాలంటూ పట్టు పడుతున్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ కంటే ముందు కార్పొరేషన్ల చైర్మెన్లు, సభ్యులను నియమించడం ద్వారా మంత్రులను సీఎం కొంతమేరకు సంతృప్తిపరిచారు. మరికొంత మందికి చైర్మెన్ పదవులపై కసరత్తు జరుగుతున్నది. కానీ క్యాబినెట్ విస్తరణకు మాత్రం బ్రేకులు పడుతున్నాయి. ఏఐసీసీ స్థాయిలో కసరత్తు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలమైన వారికే క్యాబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంటుంది. అలా జరిగినప్పుడే ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగుతుంది.అయితే మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య చాంతాడంత ఉంది. అందులో ప్రధానంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్‌రావులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో ముఖ్యులుగా ఉన్నారు. ఇప్పటికే వారు ఢిల్లీ పెద్దలతో పౖౖెరవీలు కూడా చేస్తున్నారు. పార్టీ పరంగా సీఎంపై ఒత్తిడి పెరుగుతుండడంతో వారిలో ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలన్న దానిపై రేవంత్ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్లు ఆయా వర్గాలు భావిస్తున్నాయి.