గుజరాత్‌లో పోలీసులకు చిక్కిన ఉగ్రవాదులు..!

నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. నలుగురిని విచారించేందుకు శ్రీలంక పోలీసు అధికారులు సీనియర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం మేరకు గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ నలుగురిని అరెస్టు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆదేశాల మేరకు వీరు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్‌కు వచ్చినట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టయిన నలుగురు నిందితులు పాకిస్థాన్‌లో నివసిస్తున్న శ్రీలంక నాయకుడి వద్ద పనిచేస్తున్న ఐఎస్ సభ్యులని తెలిపాయి.  ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ దేశ్‌బంధు తెన్నకోన్ ఆధ్వర్యంలో బృందాన్ని నియమించినట్లు పోలీసు అధికార ప్రతినిధి, సీనియర్ సూపరింటెండెంట్ నిహాల్ తాల్దువా తెలిపారు. ఈ దర్యాప్తులో వారు నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుంటారన్నారు. ఈ విషయాన్ని, పరిణామాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భారత అధికారులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి నుంచి ఈ నలుగురు వ్యక్తులు పాక్‌లో నివసిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ నాయకుడైన అబు అనే వ్యక్తితో పరిచయం ఉందని గుజరాత్‌ డీజీపీ వికాష్‌ సహాయ్‌ పేర్కొన్నారు.

Spread the love