మూడవ సారి నన్ను దీవించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు

– నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు
– నాపై ఎన్ని విష ప్రచారాలు  చేసినా ఓడించలేకపోయారు
– ప్రజల కోసం సేవకుడిగా పనిచేస్తా
– కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలుకు పోరాడుతా
– బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ- కమ్మర్ పల్లి : తనపై విష ప్రచారం చేసిన విపక్షాలు తన మెజారిటీని తగ్గించగలిగాయే తప్ప ఓడించలేకపోయాయని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన మాట్లాడారు.  మూడోసారి కూడా దీవించి అసెంబ్లీకి పంపుతున్న నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన  నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులకు ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు.విపక్షాలు తనపై, తన కుటుంబంపై విష ప్రచారాలు చేసినా నమ్మకుండా ప్రజలు గెలపించారన్నారు. ప్రత్యర్థులు చాలా రకాలుగా అబద్దపు ప్రచారాలు చేశారన్నారు. విష ప్రచారాలతో తన మెజారిటీని తగ్గించగలిగారే గానీ తనను ఓడించలేకపోయారని గుర్తు చేశారు. గంజాయి వ్యాపారం చేస్తున్నామని అబద్దపు ప్రచారాలు చేసినా నాగరికత లేని మనుషులపై మాట్లాడటం ఇష్టం లేక ఊరుకున్నానన్నారు. కానీ, అపోహలు కల్పించి మెజారిటీని మాత్రమే తగ్గించగలిగారన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండని సెంటిమెంటును ప్రయోగించినా ప్రజలు మాత్రం తనపైనే నమ్మకం ఉంచారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలకు సేవ చేస్తానన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలుకు పోరాడుతానన్నారు. వారిచ్చిన ప్రతి హామీ నెరవేర్చేలా ప్రజల పక్షాన నిలబడతానన్నారు. కేసీఆర్‌ అమలు చేసిన అనేక రైతు, పేదల అనుకూల కార్యక్రమాలు కొనసాగించేలా నిత్యం ప్రజల పక్షాన్నే ఉంటామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం శిరోధార్యమని, ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చాలా అబద్దపు ప్రచారాలకు పాల్పడి, ప్రజలను గందరగోళానికి గురి చేయడం వల్ల మెజారిటీ మీద ప్రభావం పడిందేమో గానీ, తన విజయాన్ని మాత్రం ఆపలేకపోయారని, గెలుపును ప్రభావితం చేయలేకపోయారని అన్నారు
Spread the love