– ముస్లిం యువకుడిపై మతోన్మాదుల దాడి
ముంబయి : హిందూ యువతితో బయటికి వెళ్లడమే ఆ ముస్లిం యువకుడు చేసిన నేరం. అంతే…మతోన్మాదులు పెట్రేగిపోయారు. ముంబయి లోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో అతనిపై దాడి చేసి చితకబాదారు. ఆ సమయంలో జై శ్రీరాం, లవ్ జిహాదీని ఆపండి అంటూ నినాదాలు చేశారు. యువకుడిపై దాడి చేయవద్దని ఆ బాలిక వేడుకుంటున్నా వారు కనికరం చూపలేదు. ఈ సంఘటన గత నెలలోనే జరిగినప్పటికీ మంగళవారం దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దుండగులు ఆ యువకుడిపై దాడి చేసి కొట్టి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు తీసికెళ్లారు.
ఈ ఘటన జూలై 21న జరిగిందని డీసీపీ దీక్షిత్ చెప్పారు. అయితే అది రైల్వే స్టేషన్లో జరిగినందున రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. రైల్వే పోలీసుల పరిధిలోని కేసు కావడంతో తాము కేసు నమోదు చేయలేదని వివరించారు. పోలీసుల కథనం ప్రకారం… యువతీ యువకులు తమ తమ ఇళ్లలో ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చారు. దీంతో యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
వారు రైలులో ముంబయి నుండి పరారయ్యేందుకు ప్రయత్నించగా ఈ విషయం యువతి బంధువులకు తెలిసింది. దీంతో వారు తమ బలగంతో రైల్వే స్టేషన్కు చేరుకొని యువకుడిపై దాడి చేశారు.