అది సీబీఐ పని కాదు

– నేరాల దర్యాప్తు మాత్రమే సంస్థ విధి
– సీబీఐ ఎంక్వైరీ ప్రజల దృష్టిని మరల్చే చర్య
– దర్యాప్తు పేరుతో చేతులు దులుపుకునే యత్నం
-కేంద్రం తీరుపై తలెత్తుతున్న అనుమానాలు
న్యూఢిల్లీ : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైలు ప్రమాదాల విషయాల్లో సీబీఐ దర్యాప్తు చేయదని, ప్రజల దృష్టిని మళ్లించే చర్యగా దీనిని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దర్యాప్తు పేరుతో ఈ అంశాన్ని సాగదీసి చేతులు దులుపుకునే చర్యకు మోడీ సర్కారు దిగిందని ఆరోపి స్తున్నారు. దీంతో రైలు ప్రమాద ఘటనపై సీబీఐని రంగంలోకి దింపటంపై అనేక ప్రశ్నలు ఎదురవుతు న్నాయి. కేంద్రం తీరును ఇటు నిపుణులూ తప్పుబడు తున్నారు. సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యా లకు సీబీఐ సహా చట్టాన్ని అమలు చేసే సంస్థలు జవాబుదారీగా ఉండవని తెలుపు తున్నారు. నేరాల ను దర్యాప్తు చేయడానికే సీబీఐ ఉద్దేశించబడిందనీ, రైల్వే ప్రమాదాల కోసం కాదని చెప్తున్నారు. ముఖ్యం గా, సీబీఐ, చట్టాన్ని అమలు చేసే ఇతర ఏదైనా ఏజెన్సీలకు రైల్వే భద్రత, సిగలింగ్‌, నిర్వహణ పద్ధతులలో సాంకేతిక నైపుణ్యం ఉండదని తెలిపారు.
2016 ఘటనను గుర్తు చేస్తున్నది మోడీకి కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే లేఖ
ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా సీబీఐ దర్యాప్తుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోడీకి నాలుగు పేజీల లేఖను రాశారు. రైల్వే ప్రమాదాలపై దర్యాప్తు జరపడానికి సీబీఐకి యోగ్యత ఉండదని కాంగ్రెస్‌ వాదిస్తున్నది. ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. ”ప్రమాదానికి గల మూల కారణాన్ని కనుగొన్నామని చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి.. సీబీఐ దర్యాప్తునకు కోరారు. 2016లో కాన్పూర్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటనలో 150 మంది మృతి చెంద టంపై విచారణ జరపాలని అప్పటి రైల్వే మంత్రి జాతీయ దర్యాప్తు సంస్థను కోరారు” అని ఖర్గే గుర్తు చేశారు. అయితే, 2018లో ఎన్‌ఐఏ విచారణను ముగించిందనీ, చార్జీషీట్‌ను దాఖలు చేసేందుకు నిరాకరించిందని పేర్కొ న్నారు. 150 మంది మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ఖర్గే ప్రశ్నించారు. ప్రస్తుత సీబీఐ దర్యాప్తు అనేది 2016 విష యాన్ని గుర్తు చేస్తున్నదని పేర్కొన్నారు. వ్యవస్థాగత భద్రతా లోపాన్ని పరిష్కరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదనీ, బదులుగా జవాబుదారీతనాన్ని పరిష్కరించే ప్రయ త్నాలను అడ్డుకునేందుకు వ్యూహాలను కను గొంటున్నట్టుగా సర్కారు చర్యలు కనిపిస్తున్నాయని వివరించారు. రైల్వేలో దాదాపు 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రస్తావిం చారు. ఖర్గే ప్రధాని మోడీకి తన లేఖలో 11 ప్రశ్నలను సంధించారు.
సీబీఐ విచారణ సరికాదు : మమత
ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచా రణను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పు బట్టారు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలనీ, అయితే కేంద్రం దీనిని కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని దీనిని రాజకీయం చేయాలని చూస్తున్న దన్నారు. ఈ విషయంలో సీబీఐ ఎంక్వైరీతో ఎలాంటి ఫలితమూ ఉం డదని చెప్పారు. గ్యానేశ్వరీ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన కేసు ను 12 ఏండ్ల క్రితం తాను సీబీఐకి అప్పగించాననీ, ఎలాంటి రిజల్ట్‌ లేదని తెలిపారు. అలాగే, సైంతియా కేసునూ సీబీఐకి అప్పగించినా.. దానిది కూడా అదే దారి అని చెప్పారు. సీబీఐ క్రిమినల్‌ కేసులను దర్యాప్తు చేస్తుందనీ, అయితే ఒడిశా ఘటన ఒక ప్రమాద కేసు అని మమత అన్నారు. ప్రమాద ఘట న వెనుక గల కారణం ప్రజలకు తెలియాలనీ, ఇది వాస్తవాన్ని తొక్కిపెట్టే సమయం కాదని తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ఆరంభం ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన అధికారులు
బాలాసోర్‌ : ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ తన దర్యాప్తును ప్రారంభించింది. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రస్తావనపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సీబీఐ తిరిగి కేసును నమోదు చేసింది. సాక్ష్యాధారాలు సేక రించేందుకు తమ బృందం బాలాసోర్‌కు చేరుకున్నదని సీబీఐ అధికారులు తెలిపారు. అంతకుముందు, అసిస్టెంట్‌ సబ్‌ ఇనస్పెక్టర్‌ పాపు కుమార్‌ నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, నిర్లక్ష్యమే ఈ ఘటనకు దారి తీసిందని పేర్కొంటూ బాలాసోర్‌ ప్రభుత్వ రైల్వే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ”కోరమాండల్‌ ఎక్స్‌్‌ప్రెస్‌, యశ్వంత్‌ పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఢ కొనడంతో రెండు రైళ్ళ బోగీలు బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో 278మంది మరణించగా, వంద లాదిమంది గాయపడ్డారు. మృతదేహాలను, గాయపడిన వారిని బాలాసోర్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రికి, సోరో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, భద్రక్‌ జిల్లా ఆస్పత్రులకు తరలించారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.” అని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొన్నది. ”ప్రస్తుత తరుణంలో రైల్వే ఉద్యోగుల నేరమనేది నిర్ధారించబడలేదు. దర్యాప్తు సమయంలో ఈ విషయం తేలనుంది.” అని ఎఫ్‌ఐఆర్‌లో వివరించ బడింది. రైల్వే భద్రతా చీఫ్‌ కమిషనర్‌ (సీసీఆర్‌ఎస్‌) శైలేష్‌ కుమార్‌ పాథక్‌ సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి, తమ దర్యాప్తులో భాగంగా అక్కడ ప్రజలతో మాట్లాడారు. సీబీఐ, సీసీఆర్‌ఎస్‌ల దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఈ ప్రమాదా నికి గల కారణమేంటనేది తెలుస్తుందని అధికారులు తెలి పారు. బాలాసోర్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసు స్టేషన్‌ ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేసిందనీ, దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఈ నెల 2వ తేదీ రాత్రి 7గంట ల సమయంలో ఈ ప్రమా దం చోటు చేసుకున్న విష యం తెలిసిందే. అధికారు లు ఇప్పటి వరకు 177 మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Spread the love