– తెలంగాణ సాయుథ రైతాంగ పోరాటంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు సంబంధమేంటి?
– జమిలి ఎన్నికలు ప్రమాదకరం
– సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థే: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ‘సెప్టెంబర్ 17’ పేరుతో సభలు పెడుతున్నాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం అధ్యక్షతన ఏఎస్‌రావు నగర్‌లోని అనుపురం కమ్యూనిటీ హాల్‌లో బుధవారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. బూర్జువా పార్టీలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై గౌరవం లేదన్నారు. తెలంగాణలో ఇప్పటికీ భూస్వాములు, దొరలు ఉన్నారన్నారు. అప్పట్లో కమ్యూనిస్టులు ప్రజా పోరాటాలతో నిజాం, కాంగ్రెస్ ప్రభుత్వాలను లొంగదీసినట్టు చెప్పారు. రైతుల పక్షాన కమ్యూనిస్టులు నిలబడ్డారు కాబట్టే నేడు తెలంగాణలో రైతులకు భూములు మిగిలాయని చెప్పారు. అందుకే ప్రజలు కమ్యూనిస్టులకు అభిమానులుగా ఉన్నారన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌కు సెప్టెంబర్17తో సంబంధం ఉన్నట్టు ఆ పార్టీల నేతలు కొత్త బిచ్చగాళ్లలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సంస్థానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం అన్నారు. అందుకే కమ్యూనిస్టులపై ఆర్‌ఎస్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఫ్యూడలిజానికి హిందూ, ముస్లిం అనే తేడా లేదన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తోందన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడానికే సెప్టెంబర్17 పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా మత కల్లోలాలు సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావడానికి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. తెలంగాణలో విష బీజాలు నాటడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని, ఈ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం రాష్ట్రాలకు హక్కులు లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోవడానికే దేశంలో ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. సమస్యలపై జీ-20లో అసలు చర్చ జరగలేదని, అది కేవలం మోడీ ఆర్భాటం అన్నారు. జీ-20కి రూ.4000 కోట్ల ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ అన్నారు. దేశంలో కుల వ్యవస్థ లేదంటే ఎవరూ నమ్మరన్నారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఎందుకు సీక్రెట్‌గా జరపాలని ప్రశ్నించారు. దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకం కావడంతో.. బీజేపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుని దేశం పేరు మార్చడానికి యత్నిస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికలకు ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. జమిలి ఎన్నికలు అత్యంత ప్రమాదకరం అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో సంబంధం లేని వారు చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. ఈ రైతాంగ పోరాటంలో పాల్గొనని కాంగ్రెస్, బీజేపీ విలీనం, విమోచన పేరుతో సెప్టెంబర్17న సభలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. ఈ సాయుధ పోరాటం కమ్యూనిస్టులవన్నీ ఆ వ్వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి గతంలో వాజ్‌పేయి ప్రయత్నం చేసినట్టు గుర్తు చేశారు. అయితే పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్టాలు అప్పట్లో వ్యతిరేకించినట్టు చెప్పారు. అప్పట్లో బీజేపీని అస్థిత్వం లేకుండా చేయాలని నితీశ్ కుమార్ ప్రయత్నం చేశారన్నారు. దేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, పీఎస్‌ఎన్ మూర్తి, వివిధ కంపెనీల కార్మికులు, ఈసీఐఎల్, ఎన్‌ఎఫ్‌సీ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.