మోడీని కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పంచాయితీ అందుకే కుట్రలు

– కేసీఆర్‌ 24 గంటల ఉచిత విద్యుత్‌ ఒక మోసం
– అది కాంగ్రెస్‌కే పేటెంట్‌
– అమెరికాలో అనని మాటలు అన్నట్టు దుష్ప్రచారం
– మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతల చిల్లర ప్రయత్నాలకు ఓ ఛానెల్‌ వత్తాసు
– ఆ అనుబంధాన్ని బయటపెడతా…: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రధాని మోడీని రక్షించేందుకు బీఆర్‌ఎస్‌ చిల్లర పంచాయతీకి తెగపడిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. అమెరికాలో తాను అనని మాటలను అన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతల చిల్లర ప్రయత్నాలకు ఓ చానెల్‌ వత్తాసు పలుకున్నదని, ఆ అనుబంధాన్నీ, వారి బాగోతాన్ని త్వరలో బయట పెడతానని హెచ్చరించారు. అమెరికాలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించి కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ను వేలెత్తి చూపించే అర్హత లేదన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం కాంగ్రెస్‌పార్టీకి పేటెంట్‌ అని గుర్తు చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ ముసుగులో బీఆర్‌ఎస్‌ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ సర్కారు రైతులకు 12 గంటలు కూడా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదనీ…అయితే 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు రైతులను మోసం చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్‌ స్టేషన్ల ముందు కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులుకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపోయిందని రేవంత్‌ పేర్కొన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు దుష్ప్రచారాలకు తెగబడ్డారని విమర్శించారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు. అది వారిలో భరోసా నింపిందని తెలిపారు. తొమ్మిదేండ్లలో విద్యుత్‌ సంస్థలకు కేసీఆర్‌ సర్కారు రూ.60 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని పేర్కొన్నారు. అవినీతితో వాటిని దివాళా తీయించిన ఘనత కేసీఆర్‌ దేనని తెలిపారు. దీనిపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాను సిద్ధమనీ, ‘కేసీఆర్‌ అండ్‌ కో’ కూడా సిద్ధంగా ఉండాలని సవాల్‌ విసిరారు.
రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దుకు నిరసనగా నేడు సత్యాగ్రహ దీక్ష
రాహుల్‌ గాంధీపై మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యహరిస్తు ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిందని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏఐసీసీ పిలుపుమేరకు బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘సత్యాగ్రహ దీక్ష’ పేరుతో గాంధీజీ విగ్రహాల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్‌పై చిల్లర హడావుడి చేస్తున్నా బీఆర్‌ఎస్‌…సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఉచిత విద్యుత్‌ రద్దుకు కాంగ్రెస్‌ కుట్రలు
– ఆ పార్టీ దుష్ట విధానాలకు రేవంత్‌ వ్యాఖ్యలే నిదర్శనం : మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఉచిత విద్యుత్‌కు ఉరి వేసేందుకు గాంధీభవన్‌ కేంద్రగా జరుగుతున్న కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలి. 24 గంటల ఉచిత కరెంట్‌ రద్దు చేసి మూడు గంటల కరెంట్‌ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్‌ దుష్ట విధానాలకు పరాకాష్ట. రైతుకు ఉచిత విద్యుత్‌ ఊపిరిలాంటిది.. రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం ఆ పార్టీ రాక్షస బుద్ధికి తార్కాణం. కాంగ్రెస్‌ కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు..అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటికీ మర్చిపోదు. కాలంలో కరువులు, కన్నీళ్లు, కటిక చీకట్లు, అప్పులు, ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కేంద్రం కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదు. 24 గంటల ఉచిత కరెంట్‌ను కాపాడుకోవడానికి ఏకంగా రూ.30వేల కోట్ల వదులుకున్నది తప్ప రైతుల ప్రయోజనాలపై రాజీపడలేదు. ఈ 24 గంటల ఉచిత విద్యుత్‌ వెలుగుల్ని వదులుకుందామా? కటిక కాంగ్రెస్‌ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా? చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి’ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్‌ పార్టీ రైతుల్ని చంపుకుతినే రాబందని మరోసారి తేలిపోయిందని ఈ సందర్భంగా కేటీఆర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అవసరం లేదని కాంగ్రెస్‌ చేసిన ప్రకటన ఆ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. నిన్నటిదాకా ధరణి రద్దు.. రైతుబంధు వద్దూ అంటూ ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌, ఇప్పుడు ఏకంగా ఫ్రీ కరెంట్‌ను ఎత్తేస్తామన్న తన క్రూరమైన ఆలోచనను బయటపెట్టుకుందని తెలిపారు. ఉచిత విద్యుత్‌కు ఉరి వేసేందుకు గాంధీ భవన్‌ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. ఆనాడు విద్యుత్‌ కోతలతో చాలీచాలని మూడు గంటల నాసిరకం కరెంట్‌తో రైతులు నరకం అనుభవించారని వాపోయారు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో ఎండిన పంటలు, రైతుల ధర్నాలు, సబ్‌ స్టేషన్లుపై దాడులతో పరిస్థితులు దారుణంగా ఉండేవని, అలాంటి దుర్భరమైన పరిస్ధితులు తొమ్మిదేండ్లుగా మారిపోయాయని తెలిపారు. అర్ధరాత్రి అపరాత్రి మోటర్లు పెట్టడానికి పోయి పాము కాట్లకు, కరెంట్‌ షాకులకు ఎంతో మంది రైతులు చనిపోయారని గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్‌ హయాంలో ఎరువుల్ని పోలీస్‌ స్టేషన్లలో పెట్టి అమ్మే దుస్థితి ఉండేదని, కిలోమీటర్లు దూరం క్యూలైన్లలో చెప్పులు, లాఠీచార్జీల దశ్యాలే కాంగ్రెస్‌ పాలనా పాడుకాలంలో ఉండేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ కల్తీ పాలనలో రైతులకు దొరికింది కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులేనని విమర్శించారు.

Spread the love