కార్పొరేట్లకోసమే ఆ జీవో..

– కార్మిక హక్కుల జోలికొస్తే..ఖబడ్దార్‌
– లేబర్‌ కోడ్‌లపై కాంగ్రెస్‌ వైఖరి ప్రకటించాలి
– బొగ్గు వేలాన్ని నిలిపేసి, అదనంగా గనులు కేటాయించాలి:
– రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కార్మిక నేతల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘కార్పొరేట్ల ఒత్తిడి, వారి లాభాల కోసమే జీవో నెంబర్‌ ఐదును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఐటి పరిశ్రమలకు కార్మిక చట్టాలను సడలిస్తూ ఆ జీవోను విడుదల చేయటమంటే..వారితో వెట్టి చాకిరి చేయించాలనుకుంటున్నారా? ఇప్పటికే రాష్ట్రంలో ఐటీఈఎస్‌ పరిశ్రమల్లో చట్టబద్ద సౌకర్యాలు అమలు కావటం లేదు. ప్రజా ప్రభుత్వానికి కార్మికుల ప్రయోజనాలు పట్టవా? చట్ట ప్రకారం కార్మికుడు ఎన్ని గంటలు పనిచేయాలి? ఆ పరిశ్రమల్లో ఎంత సమయం పనిచేస్తున్నారు? ఈ విషయాన్ని పరిశీలించాల్సిన కార్మిక శాఖ ఏం చేస్తున్నట్టు? కార్మికుల కష్టాన్ని అప్పనంగా కార్పొరేట్లకు దారబోయాల్సిందేనా?’ అని పలువురు కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు అధ్యక్షతన ‘ఐటిఈఎస్‌ పరిశ్రమలకు కార్మిక చట్టాల మినహాయింపు జీవో నెంబర్‌5ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’ అనే అంశపై రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, హెచ్‌ఎంఎస్‌ అధ్యక్షులు రెబ్బ రామారావు, ఐఎన్‌టీయూసీ కార్యదర్శి ఎంకే బోస్‌, ఐఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ప్రవీణ్‌, ఏఐడీఈఎఫ్‌ ఉపాధ్యక్షులు తిరుపతి, బీఈఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు సుందర్‌రాం, ఎల్‌ఐసీ యూనియన్‌ నాయకులు రవీంద్రనాధ్‌, సీసీజీఈడబ్ల్యూ నాయకులు అజీజ్‌, ఆర్‌బీఐ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఎంవి హరీష్‌బాబు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాన్ఫడరేషన్‌ అద్యక్షులు నాగేశ్వరరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఉపాధ్యక్షులు ఏవీరావు, టీఎంఎస్‌ఆర్‌యూ నాయకులు ముకుంద్‌కులకర్ని, హనుమయ్య తదితర నేతలు మాట్లాడారు. పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఐటిఈఎస్‌ పరిశ్రమలకు కార్మిక చట్టాలు వర్తించబోవన్నారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్య అని విమర్శించారు. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వాస్తవంగా ఆ పరిశ్రమల్లో కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ ఐదును విడుదల చేయటం ద్వారా కార్మికులకు ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకుందో స్పష్టం చేయాలన్నారు. పని గంటలు పెంచుతామని చెప్పదల్చుకుందా? పని ప్రదేశాల్లో భద్రత ఉండదని చెప్పదల్చుకుందా? అని నిలదీశారు. రవాణా సౌకర్యాలు, వేతనాలు, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన కొన్ని షరతులను అమలు చేయాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వటమంటే..ఈ ప్రభుత్వం పరోక్షంగా కార్మికుల పక్షం కాదు..కార్పొరేట్ల పక్షమేనని చెప్పకనే చెప్పిందని విమర్శించారు. గత అనేక సంవత్సరాలుగా ఐటీ పరిశ్రమలను, కంపెనీలను కార్మిక శాఖ తనిఖీలు చేయటం మానేసిందని గుర్తు చేశారు.రాత్రి షిప్టుల మూలంగా మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్లనుంచి ఆ పరిశ్రమలు కార్మిక చట్టాల నుంచి మినహాయింపును పొందుతున్నాయనీ, కోట్లాది రూపాయల లాభాలు అర్జిస్తున్నాయని చెప్పారు.రామారావు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమన్నారు. లేబర్‌ డిపార్ట్‌ మెంట్‌ లేబుల్‌ డిపార్ట్‌మెంట్‌గా మారిందని విమర్శించారు. బోస్‌ మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు కాకపోవటంతో కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ లేబర్‌ కోడ్‌లలో అంతర్భాగమే జీవో నెం ఐదు అని చెప్పారు.
వెట్టి కూలీల్లాగే ఆ పరి శ్రమల్లో పనిచేసే కార్మికుల కష్టాన్ని దోచుకునేందుకే ఆ జీవో అని విమర్శించారు. హనుమయ్య, సుందర్‌రాం, కులకర్ని, నాగేశ్వరరావు, తిరుపతి తదితరులు మాట్లాడుతూ జీవో నెంబర్‌ ఐదును ఉపసంహరించుకునే వరకు వివిధ రూపాల్లో ఐక్య పోరాటాలను నిర్వహించాలని సూచించారు. జీవో నెంబర్‌ 5ను రద్దు చేయాలనీ, బొగ్గు వేలాన్ని నిలిపివేసి, అదనంగా గనులను పెంచాలనీ, లేబర్‌ కోడ్‌ల విషయంలో కాంగ్రెస్‌ వైఖరి ప్రకటించాలనే తార్మానాలను ఎస్‌ బాలరాజు ప్రవేశ పెట్టగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌తో పాటు ఇతర సంఘాల నాయకలు పాల్గొన్నారు.

Spread the love