– నూతన రాజ్యాంగంపై న్యాయ నిపుణుల మనోగతం
– నియంతృత్వాన్ని కోరరాదని హితవు
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో అమలవుతున్న రాజ్యాంగం వలసవాదుల కాలం నాటిదని, అందుకే నూతన రాజ్యాంగ రచన అవసరమని ఇటీవల కొందరు వాదిస్తున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగం బ్రిటీష్ పాలన నాటిదే అయినప్పటికీ అందులోని విషయాలన్నింటినీ చెడ్డవిగా భావించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి 1935వ సంవత్సరం నాటి భారత ప్రభుత్వ (జీఓఐ) చట్టం అత్యద్భుతమైనదని బీఆర్ అంబేద్కర్, బెనెగల్ నర్సింగ్ రావు, రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షీ సహా పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఈ చట్టం ఆధారంగానే భారత నూతన రాజ్యాంగాన్ని రచించాలని వారు సూచించారు. ఎందుకంటే అది బాగా ఆలోచించి రాసిన పత్రం. వలసవాదుల కాలం నాటి చట్టాన్ని అంగీకరించడం అంటే మన పురాతన సంప్రదాయాలను అవమానించినట్లుగా భావించకూడదు. దానిని వివేకవంతమైన, ఆచరణాత్మక మైన చర్యగానే చూడాల్సి ఉంటుంది.
రాజ్యాంగ రచనకు 1935వ సంవత్సరపు జీఓఐ చట్టమే ఆధారమైనప్పటికీ అందులో కొన్ని మార్పులు చేశారు. ఉదాహరణకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. వేర్వేరు రకాల ఓటర్ల పద్ధతికి స్వస్తి చెప్పారు. 1935వ చట్టంలోని కొన్ని అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. భారతీయులకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సరిపోయింది. అదే పాకిస్తాన్, శ్రీలంక దేశాలు అధ్యక్ష తరహా పాలన వైపు వెళ్లి అనేక సమస్యలు ఎదుర్కొ న్నాయి. ఆ ప్రయోగం నుండి ఆయా దేశాలు ఇప్పటికీ కోలుకోలేదు. నెదర్లాండ్స్, ఇజ్రాయిల్ దేశాలలో అస్థిరతను గమనిస్తే మనం చాలా నయమని అర్థమవుతుంది.
మార్పులు మంచివే
రాజ్యాంగాన్ని సవరించడం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. అయితే కొన్ని సవరణలను ప్రభుత్వాలు మంద బలంతో తమకు అనుకూలంగా చేసు కున్నాయి. అది వేరే విషయం. రాజ్యాంగాన్ని సమూలంగా మారేసి కొత్తగా రాయాలన్న ఆలోచనే ప్రమాదకరమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అమెరికాలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగాన్ని తిరగరాస్తున్నారు. అయితే దానివల్ల జరుగుతున్న అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. మన రాజ్యాం గం ఎంతో గొప్పగా ఉన్నదని, అందులో లోపాలే లేవని చెప్ప లేము. కానీ దానిలో అక్కడక్కడా మార్పులు చేసుకొని సరి దిద్దుకునే అవకాశం ఉంది. అంతేకానీ రాజ్యాంగాన్ని మొత్తంగా రద్దు చేసి, నూతన రాజ్యాంగ రచన చేస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి.
ఇష్టారాజ్యం అంటే కుదరదు
రాజ్యాంగాన్ని మూడింట రెండు వంతుల మెజారిటీతో సవరించవచ్చు. అంతమాత్రాన ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే నడవదు. రాజ్యాంగాన్ని సవరించి భారతదేశాన్ని అమెరికా అనో లేదా మరో దేశమనో ప్రకటించగలమా ? ఎంపీలు తమ సంతానాన్ని ఆ పదవికి వారసులుగా ప్రకటించగలరా ? భారతావని రిపబ్లిక్ దేశం. దానిని నియంతృత్వ దేశంగా ప్రకటించడం పార్లమెంటుకు కూడా సాధ్యం కాదు.
కొన్ని అంశాలకు సంబంధించి కాలానుగుణంగా వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ దాని మౌలిక స్వభావాన్ని మార్చడం అసంభవం. రాజ్యాంగాన్ని తరచూ మారుస్తున్న దేశాలు సమస్యల సుడిగుండంలో పడి కొట్టుకుంటున్నాయి. ఫ్రాన్స్‌లో ప్రతి యాభై సంవత్సరాలకు, లాటిన్ అమెరికాలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగాలను మారుస్తున్నారు. మార్పు అనేది అనివార్యమే కానీ ఆ సవరణలు కొన్ని అంశాలకే పరిమితం కావాలి.