
– ఇల్లంతకుంట నుండి మండల కేంద్రానికి రవాణా
నవతెలంగాణ – బెజ్జంకి
ఎంత అందితే అంత దోచుకోవడం అన్నట్టుంది ఈ ప్రభుత్వంలో చెరువు శిఖం మట్టిని నిబంధనలకు విరద్ధంగా అడ్డగోలుగా రెయింబవళ్లు అక్రమంగా తరలించుకుంటూ, రైతుల వ్యవసాయ సాగు భూముల్లో నిల్వ చేస్తున్నారు మట్టి దొంగలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామ శివారులోని చెరువు నుండి భారీ వాహనాల ద్వార తరలిస్తూ మండల కేంద్రం శివారులో ఓ రైతు వ్యవసాయ సాగు భూమిలో భారీగా మట్టి నిల్వ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న మట్టి రవాణపై అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మట్టిని తరలిస్తున్న భారీ వాహనాలతో భయాందోళనకు గురవుతున్నామని కల్లెపల్లి గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతార్ చేస్తూ కనీసం అధికారులకు సమాచారం లేకుండా మట్టి దొంగలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ అక్రమంగా ఏర్పాటుచేసిన మట్టి నిల్వలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కల్లెపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
ఎర్ర నెలలో నల్ల మట్టి నిల్వ..?
మండల కేంద్రం శివారులోని కల్లెపల్లి వేళ్లే మార్గంలో రోడ్డు ప్రక్కన ఓ రైతు వ్యవసాయ సాగు చేసే ఎర్ర నేలలో భారీగా నల్ల మట్టి నిల్వ చేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా మట్టి నిల్వ చేసిన ప్రాంతానికి కనుచూపు మేరలో ఇటుక బట్టి ఉండడం విశేషం. అధికారులు విధుల్లో లేని సమయం, జన సంచారం లేని సమయాన్ని అదునుగా చేసుకుని పథకం ప్రకారమే ఇటుక బట్టికి తరలించడానికి భారీగా మట్టిని నిల్వ చేశారని పలువురు వాపోతున్నారు.