నటుడి ఇంట తీవ్ర విషాదం..

నవతెలంగాణ-హైదబరాబాద్ :  తమిళ నటుడు బోస్ వెంకట్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న బోస్ వెంకట్ సోదరి వలర్మతి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో వారి కుటుంబం శోకసంద్రంలో ఉండగా, తన సోదరి మరణాన్ని చూసి తట్టుకోలేక వెంకట్ సోదరుడు రంగనాథన్ కూడా గుండెపోటుకు గురయ్యాడు. ఆ వెంటనే ఆమె మృతదేహంపై కుప్పకూలి మరణించాడు. తమ సోదరి అంత్యక్రియల సమయంలో రంగనాథన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఇక వీరి అంత్యక్రియలు అరంతంగిలో నిర్వహించనున్నట్లు సమాచారం. రెండు వరుస మరణాలు బోస్ వెంకట్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఈ ఘటన తమిళ సినీ, టీవీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ వర్గాల వారు బోస్ వెంకట్ అభిమానులు ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ప్రముఖ నటుడుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్న బోస్  ఈ మధ్యనే సినిమా దర్శకుడిగా మారారు. ఇక ‘మెట్టి ఓలి’ సీరియల్ ద్వారా బ్రేక్‌ సంపాదించిన బోస్ ఇప్పుడు తమిళ బుల్లితెర నటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

Spread the love