– ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీచర్ల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ మీడియా ఇన్‌చార్జి ఎన్వీ.సుభాష్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తన మీద నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన జాతీయ నాయకత్వానికి, ఎంపికలో సహకరించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరు, ఎంపీలు ఈటల రాజేందర్, డాక్టర్ కె.లక్ష్మణ్, అరవింద్‌కి, ఎమ్మెల్యేలకు, ముఖ్యనాయకులకు, ధన్యవాదాలు తెలిపారు. తాను సొంతూరులో మూడో తరగతి వరకు, అప్పన్నపేటలో పదోతరగతి దాకా, కరీంనగర్‌లో ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించానని చెప్పారు. 1994 నుంచి తాను విద్యాసంస్థలను నడుపుతున్నాననీ, ఆరువేల మంది టీచర్లు తమ సంస్థల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు టీచర్లకు ఒకే రకమైన సమస్యలుంటాయనీ, 40 ఏండ్లుగా విద్యార్థులను తయారు చేస్తూ, టీచర్ల సమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్పారు. ఉత్తమ పౌరులను తయారుచేయడం టీచర్లతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతామన్నారు.