– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-మహాబూబాబాద్
ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, అధ్యాపక, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ – ఖమ్మం- నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో అధ్యాపకులను, ఉపాధ్యాయులను కలిసి తనకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం ఐదున్నరేండ్లుగా నిరంతరం ప్రభుత్వంతో పోరాడి కొన్ని సాధించామన్నారు. మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరింత శ్రమించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో అధ్యాపక, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలి సభ్యునిగా మరోసారి తనను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సరైన వసతులు కల్పిస్తూ బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు సకాలంలో చెల్లించాల్సిన ఐదు డీఏలలో ఒకటి ప్రకటించి నిరాశకు గురిచేశారని చెప్పారు. మిగతా డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవో 317తో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. గురుకుల పాఠశాలలో వార్డెన్‌లను నియమించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎ.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్కె యాకూబ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.కుమార్, కె.రాజశేఖర్ పాల్గొన్నారు.