– డిగ్రీ సిలబస్ మార్పుపై కసరత్తు
– నేడు వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉన్నత విద్యారంగం బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నది. ప్రపంచంలో వస్తున్న మార్పులు, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా డిగ్రీ సిలబస్‌ను మార్చాలని భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి నేతృత్వంలో బీకాం, లా సబ్జెక్టులు, వైస్ చైర్మెన్ ఇటిక్యాల పురుషోత్తం నేతృత్వంలో బీఏ సబ్జెక్టులు, వైస్ చైర్మెన్ ఎస్‌కే మహమూద్ నేతృత్వంలో సైన్స్ సబ్జెక్టుల మార్పుపై కమిటీలను నియమించారు. డిగ్రీ సిలబస్ మార్పుపై ఇప్పటికే పలు సమావేశాలు జరిగాయి. త్వరలో సబ్జెక్టుల వారీగా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, కళాశాల విద్యాశాఖ అధికారులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకులతో కమిటీలను నియమించే అవకాశమున్నది. అందరికీ ఉన్నత విద్యావకాశాలను అందించడంతోపాటు సరసమైన ఫీజులు ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా 12 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీధర్ కూడా హాజరవుతారు. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్ల భర్తీకి సంబంధించిన అంశంపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. బీ కేటగిరీ సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. అందుకు సంబంధించిన విధివిధానాలను చర్చించి ఖరారు చేసే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏండ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏండ్లు ఉన్నది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లు. రాష్ట్రంలోనూ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచాలన్న డిమాండ్ ఉన్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదన పంపించింది.
బీఏ సెక్యూరిటీ, డిఫెన్స్ లా కోర్సు
వచ్చే విద్యాసంవత్సరంలో బీఏ సెక్యూరిటీ, డిఫెన్స్ లా కోర్సును ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి సమాలోచన చేస్తున్నది. ఇందుకు సంబంధించి కర్రికులమ్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ కోర్సును అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అయితే కోర్సును ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టినా వారం రోజులు విద్యార్థులు రెగ్యులర్‌గా తరగతులు హాజరయ్యే విధంగా విధివిధానాలను తయారు చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా కోర్సు ఫీజును నిర్ణయిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు.