– ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ పెద్దవంగర
భూ సమస్యలు లేని గ్రామాలను ఏర్పరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ అన్నారు. గురువారం మండలంలోని చిన్నవంగర గ్రామంలో”భూ న్యాయ శిబిరం” నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమ్మకానికి వెళ్లినప్పుడే భూ సమస్య వెల్లడవుతుందని, దాంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే భూమి హక్కుల పరీక్ష చేసుకోవడం రైతులు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కొత్తగా ఉన్నా తప్పనిసరి అన్నారు. ప్రతి మనిషి తన ఆరోగ్యం గురించి ఎలాగైతే వైద్య పరీక్షలు చేయించుకుంటారో ఇది కూడా అలాంటిదేనని పేర్కొన్నారు. భూ సమస్యలు ఎలాంటిదో తెలిస్తే తప్ప దాని పరిష్కార మార్గం వెతకడం కష్టమన్నారు. అందుకే తాము భూ న్యాయ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాగు న్యాయ కేంద్రాల ద్వారా రైతులకు ఉచితంగా భూమి హక్కుల పరీక్ష చేసి రిపోర్టు ఇస్తున్నామని తెలిపారు. లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎవరైనా రైతులు ఫోన్ చేసి తమ భూమి సమస్యల పరిస్కారానికి ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామన్నారు. భూమి సమస్యలు ఉన్న రైతులకు భూమి చట్టాలు మరియు రెవిన్యూ నిపుణులు, న్యాయవాదులచే న్యాయ సలహాలు అందించడానికి గ్రామాలలో “భూన్యాయ శిబిరాల”ను నిర్వహిస్తున్నామని సునీల్ తెలిపారు. కార్యక్రమంలో లీఫ్ సంస్థ సలహాదారుడు కరుణాకర్ దేశాయ్, ఉపాధ్యక్షుడు జీవన్ రెడ్డి, న్యాయవాదులు మల్లేశం, ప్రవీణ్, శ్రీకాంత్, తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ రెడ్డి దేశాయ్, తహశీల్దార్ మహేందర్, కాంగ్రెస్ నాయకులు మెట్టు నగేష్, రామకృష్ణారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.