– అథ్లెటిక్స్‌లో డబుల్ ధమాకా
– హాంగ్జౌ ఆసియా క్రీడలు 2023
– స్క్వాష్‌లో మెన్స్ జట్టుకు స్వర్ణం
– టెన్నిస్‌లో బోపన్న, రుతుజకు గోల్డ్
నవతెలంగాణ-హాంగ్జౌ
హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మనోళ్లు పసిడి మోత మోగించారు. స్క్వాష్‌లో మెన్స్ జట్టు పసిడి పోరులో పాకిస్థాన్‌ను చిత్తు చేసి బంగారు పతకం గెల్చుకోగా.. టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, రుతుజ జోడీ స్వర్ణం సొంతం చేసుకుంది. దీంతో భారత్ పసిడి పతకాల సంఖ్య పదికి చేరుకుంది. అథ్లెటిక్స్‌లో స్ప్రింటర్లు ఒకే ఈవెంట్లో రెండు మెడల్స్ అందించగా, షూటింగ్‌లో మనకు మరో వెండి పతకం సొంతమైంది. ఓవరాల్‌గా 38 మెడల్స్‌తో పతకాల పట్టికలో భారత్ నాల్గో స్థానంలో కొనసాగుతుంది.
స్క్వాష్‌లో టీమ్ ఇండియా ఉద్విగ పసిడి పతకం సొంతం చేసుకుంది. స్వ్కాష్ మెన్స్ జట్టు విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్న టీమ్ ఇండియా.. పసిడి పోరులో దాయాది పాకిస్థాన్‌పై ఘన విజయం నమోదు చేసింది. ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించిన పాకిస్థాన్.. భారత్‌పై ఒత్తిడి పెంచింది. అయినా, చివరి రెండు మ్యాచులను అద్వితీయ రీతిలో గెల్చుకున్న భారత్ ఈ విభాగంలో పసిడి పతకం దక్కించుకుంది. తొలి రెండు మ్యాచుల అనంతరం భారత్, పాకిస్థాన్ 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడో మ్యాచ్‌లో అభరు సింగ్ ఐదు గేముల మ్యాచ్‌లో మెరుపు విజయం అందించాడు. పాక్ ఆటగాడు జమాన్ నూర్‌పై 11-7, 9-11, 8-11, 11-9, 12-10తో కండ్లుచెదిరే విజయం సాధించాడు. తొలి గేమ్ నెగ్గిన అభరు సింగ్.. తర్వాత వరుసగా రెండు గేముల్లో నిరాశపరిచాడు. పాకిస్థాన్ పసిడికి మరో గేమ్ దూరంలో నిలిచిన తరుణంలో అభరు సింగ్ అద్భుతమే చేశాడు. చివరి రెండు గేముల్లో సత్తా చాటాడు. భారత్‌కు పసిడి పతకం అందించాడు. అంతకముందు తొలి మ్యాచ్‌లో మహేశ్ మనోహర్ నిరాశపరిచాడు. ఇక్బాల్ నజీర్‌కు 8-11, 3-11, 2-11తో వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. కీలక రెండో మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు సౌరవ్ ఘోషల్ అదరగొట్టాడు. 11-5, 11-3, 11-2తో వరుస గేముల్లో మహ్మద్ ఆసీం ఖాన్‌ను చిత్తు చేశాడు. స్క్వాష్ మహిళల జట్టు విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కిన సంగతి తెలిసిందే.
టెన్నిస్‌లో స్వర్ణం
పురుషుల డబుల్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న భారత్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారానికి తగ్గలేదు. భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన రుతుజ సంపత్‌రావు ఆసియా క్రీడల్లో స్వర్ణం సొంతం చేసుకుంది. పసిడి పోరులో చైనీస్ తైపీ జోడీ లియాంగ్, హుయాంగ్ జంటతో పోటీపడిన బోపన్న, రుతుజ జోడీ.. తొలి సెట్లో నిరాశపరిచారు. 33 నిమిషాల పాటు సాగిన తొలి సెట్‌ను 6-2తో చైనీస్ తైపీ జంట కైవసం చేసుకుంది. దీంతో రెండో సెట్లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి మనోళ్లకు ఏర్పడింది. 30 నిమిషాల్లోనే రెండో సెట్ లాంఛనం ముగించిన బోపన్న, రుతుజ 6-3తో స్కోరు సమం చేసింది. పసిడి పోరును నిర్ణయాత్మక టైబ్రేకర్ సెట్‌కు తీసుకెళ్లింది. టైబ్రేకర్‌లో 10-4తో సత్తా చాటిన బోపన్న, రుతుజ స్వర్ణం ముద్దాడింది. బోపన్న, రుతుజ జోడీ ఎనిమిది ఏస్‌లు, ఓ బ్రేక్ పాయింట్ సాధించారు. పాయింట్ల పరంగా భారత జోడీ 60-56తో చైనీస్ తైపీపై పైచేయి సాధించింది.
షూటింగ్‌లో మరో సిల్వర్
భారత షూటర్లు హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించారు. 1986 ఆసియా క్రీడల్లో షూటర్లు భారత్‌కు 14 పతకాలు అందించగా.. తాజా ఆసియా క్రీడల్లో ఏకంగా 19 పతకాలు గెల్చుకున్నారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ వెండి పతకంతో మెరిసింది. యువ షూటర్లు సరబ్జోత్ సింగ్, దివ్య సుబ్బరాజు జోడీ సిల్వర్‌తో సత్తా చాటింది. 13, 14వ రౌండ్ వరకు 13-13, 14-14తో చైనా షూటర్లతో సమవుజ్జీగా నిలిచిన మనోళ్లు.. చివర్లో ఆతిథ్య చైనాకు పసిడి కోల్పోయారు. 15వ రౌండ్‌లో చైనా షూటర్లు 21.0, 10.7, 10.3 స్కోరు చేయగా.. భారత షూటర్లు 20.4, 9.9, 10.5తో కాస్త తడబడ్డారు. ఇక్కడే రెండు పాయింట్ల ఆధిక్యం సాధించిన చైనా బంగారు పతకం కైవసం చేసుకుంది. సరబ్జోత్ సింగ్, దివ్య సుబ్బరాజు జోడీ సిల్వర్ మెడల్ దక్కించుకుంది.
ట్రాక్‌లో డబుల్ ధమాకా
అథ్లెటిక్స్‌లో భారత్ జోరు కొనసాగుతుంది. తొలి రోజు పోటీల్లో కిరణ్ బలియన్ మహిళల షాట్‌పుట్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించగా.. శనివారం జరిగిన రేసుల్లో మెన్స్ 10000 మీటర్ల రేసులో భారత్‌కు ఏకంగా రెండు పతకాలు వచ్చాయి. కార్తీక్ కుమార్, గుల్వీర్ సింగ్‌లు రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. 28.15.38 సెకండ్లలో రేసు పూర్తి చేసిన కార్తీక్ కుమార్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. గుల్వీర్ సింగ్ 28.17.21 సెకండ్ల టైమింగ్‌తో కాంస్య పతకం దక్కించుకున్నాడు. 10000 మీటర్ల ఈవెంట్‌లో భారత్ చివరగా 1998లో మెడల్ సాధించింది. 1998లో గులాబ్ చంద్ కాంస్య నెగ్గగా..1978 బ్యాంకాక్‌లో హరిచంద్ పసిడి సాధించాడు. 1974లో శివనాథ్ సింగ్ (సిల్వర్), 1962లో తర్లోక్ సింగ్ (గోల్డ్), 1951లో గుర్బాచాన్ సింగ్ కాంస్యంతో మెరిశారు. ఈ విభాగంలో పతకాల పంట పండించిన మన స్ప్రింటర్లు 1998 తర్వాత మెడల్ నెగ్గటం ఇదే ప్రథమం.
షట్లర్లకు సిల్వర్ ఖాయం!
భారత షట్లర్లు జట్టు విభాగంలో కనీసం రజతం ఖాయం చేసుకున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత మెన్స్ జట్టు దక్షిణ కొరియాపై 3-2తో ఘన విజయం సాధించింది. సెమీస్‌లో తొలి మ్యాచ్‌లో హెచ్.ఎస్ ప్రణరు 18-21, 21-16, 21-19తో జియోన్‌పై గెలుపొంది శుభారంభం చేశాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ నిరాశపరిచింది. 13-21, 24-26తో సియో, కాంగ్‌ల చేతిలో పోరాడి ఓడింది. మూడో మ్యాచ్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ దుమ్మురేపాడు. 21-7, 21-9తో వరుస గేముల్లో ఏకపక్ష విజయం నమోదు చేసి భారత్‌కు 2-1 ఆధిక్యం అందించాడు. నాల్గో మ్యాచ్‌లో ఎంఆర్ అర్జున్, ధ్రువ్ జోడీ 16-21, 11-21తో నిరాశపరచగా స్కోర్లు 2-2తో సమం అయ్యాయి. నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. మూడు గేముల మ్యాచ్‌ను 2-1తో గెలుపొందాడు. తొలి గేమ్‌లో 12-21తో తడబడినా.. 21-16, 21-14తో చెలరేగాడు. భారత్‌కు 3-2తో దక్షిణ కొరియాపై విజయాన్ని అందించాడు. మరో సెమీఫైనల్లో జపాన్‌పై చైనా 3-1తో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. నేడు జరిగే పసిడి పోరులో చైనా, భారత్ తలపడన్నాయి.
హాకీ ఇండియా గ్రూప్ దశలో అజేయంగా నిలిచింది!. తొలుత సింగపూర్‌పై 16-0, జపాన్‌పై 4-2తో విజయాలు సాధించిన భారత్ తాజాగా పాకిస్థాన్‌ను 10-2తో చిత్తు చేసింది. గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాక్‌పై పంజా విసిరిన హాకీ ఇండియా గోల్స్ వర్షం కురిపించింది. వరుణ్ కుమార్ (54, 41వ నిమిషం), లలిత్ ఉపాధ్యారు (49వ నిమిషం), షంషీర్ సింగ్ (46వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (34, 33, 17, 11వ నిమిషం), సుమిత్ (30వ నిమిషం), మన్‌దీప్ సింగ్ (8వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. పాకిస్థాన్ తరఫున రానా, ఎం.ఎస్ ఖాన్‌లు చెరో గోల్ కొట్టి ఊరట అందించారు. గ్రూప్ దశలో 2న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
బాక్సర్ల దూకుడు
బాక్సింగ్‌లో మనోళ్లు సత్తా చాటుతున్నారు. తెలుగు తేజం నిఖత్ జరీన్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌తో పాటు పతకం ఖాయం చేసుకోగా ఆమె బాటలోనే లవ్లీనా బొర్గొహైన్, ప్రీతి నడిచారు. మహిళల 75 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ చాంపియన్ లవ్లీనా బొర్గొహైన్ 5-0తో కొరియా బాక్సర్‌ను చిత్తు చేసింది. 30-27, 30-27, 30-27, 30-27, 30-27తో ఐదుగురు న్యాయమూర్తులు లవ్లీనా ఏకగ్రీవ విజేతగా ప్రకటించారు. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి సైతం సెమీస్‌కు చేరుకుంది. కజకిస్థాన్ బాక్సర్‌పై 4-1తో విజయం సాధించింది. మెన్స్ 91 కేజీల విభాగంలో నరేందర్ 5-0తో ఇరాన్ బాక్సర్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరుకున్నాడు. లవ్లీనా, ప్రీతి, నరేందర్‌లు సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకంతో పాటు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు.