– గ్రేటర్ నోయిడాలో మళ్లీ మొదలైన రైతుల ఆందోళన
– ఢిల్లీ మార్చ్ ప్రారంభం
– బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
– దిగొచ్చిన యూపీ ప్రభుత్వం
– రైతులతో చర్చలకు సీఎస్ హామీ
– లిఖితపూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమణ : ఎస్కేఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో భారీ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన వారికి పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన మళ్లీ మొదలైంది. ఏఐకేఎస్‌తో సహా పది రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు తలపెట్టిన ఢిల్లీ మార్చ్‌ను యూపీ-ఢిల్లీ సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. వారు పార్లమెంటు మార్చ్‌ను ప్రకటించారు. ప్రభుత్వం తమ దగ్గరకు వచ్చి చర్చించాలని, లేకపోతే వెనక్కి తగ్గేది లేదని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. దీంతో ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్చకు హామీ ఇచ్చింది. త్వరలో నేరుగా వచ్చి చర్చలు జరుపుతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని డిమాండ్లను ఆమోదించి లిఖితపూర్వక హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదని ఎస్కేఎం ప్రకటించింది. ఈ ఆందోళనలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే అథారిటీ, యూపీ ఇండిస్టియల్ డెవలప్‌మెంట్ అథారిటీ, పెద్ద ప్రాజెక్టుల కోసం భూమిని ఇచ్చిన రైతులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని 14 ఏండ్లుగా నిరంతరం ఆందోళన చేస్తున్నా యూపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు విమర్శించారు. అభివృద్ధి చేసిన భూమిలో 10 శాతం, తగిన పరిహారం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ నోయిడాలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనను ముగించి సోమవారం ఢిల్లీ మార్చ్‌కు సిద్ధమయ్యారు. ఈ మార్చ్‌ను ఆపడానికి యూపీ పోలీసులు చేసిన ప్రయత్నాలను మహిళలతో సహా రైతులు ప్రతిఘటించారు. పోలీసు వలయాలు, బారికేడ్లు, ముళ్ల కంచెలు, ఇసుకతో నింపిన కంటైనర్లను నెట్టుకుంటూ రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయగా సరిహద్దు వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. గౌతమ్ బుద్ధనగర్ వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వస్తారన్న ప్రభుత్వ సందేశాన్ని ఎస్కేఎం నాయకత్వానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అదనపు పోలీసు కమిషనర్ తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చే వరకు రహదారి దిగ్బంధనాన్ని విరమిస్తున్నట్టు నేతలు ప్రకటించారు.
గ్రేటర్ నోయిడా భూసేకరణ బాధితులకు ఏఐకేఎస్ అభినందనలు
గ్రేటర్ నోయిడా, నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, యూపీఎస్‌ఐడీసీ, ఇతర ప్రాజెక్టుల నుంచి భూసేకరణ బాధిత రైతులు ప్రారంభించిన మిలిటెంట్ పోరాటాన్ని ఏఐకేఎస్ స్వాగతించింది. రైతులకు అభినందనలు తెలిపింది. ఈమేరకు ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, విజూ కృష్ణన్ ప్రకటన విడుదల చేశారు. ఐదు రోజుల పాటు సంబంధిత ప్రాంతంలో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌కు తమ నిరసనను తెలిపేందుకు సోమవారం ఢిల్లీ కూచ్ (మార్చ్ టు ఢిల్లీ) నిర్వహించారు. మహామాయ ఫ్లైఓవర్ నుంచి వీరి మార్చ్ ప్రారంభం కాగా మూడు గంటల పాటు పోలీసులతో రైతులు పోరాడారని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే మార్గంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, ముళ్ల వైర్లు, ట్రక్కులు, షిప్పింగ్ కంటైనర్లు మొదలైన బహుళ అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగారని తెలిపారు. ఢిల్లీ-నోయిడా సరిహద్దులో శాశ్వత ఫ్రంట్ ఏర్పాటు చేయాలని రైతులు నిర్ణయించారు. వేలాది మంది రైతులు ఎక్స్‌ప్రెస్‌వేను అడ్డుకోవడాన్ని చూసి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దిగొచ్చిందని తెలిపారు.