దారుణం.. ఏడో తరగతి బాలికపై లైంగికదాడి,హత్య..!

నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అదృశ్యమైన బాలిక ఇంటి సమీపంలోని పొదల్లో శవమై కనిపించింది. భీమవరంలోని ఓ కాలనీలో ఏడో తరగతి విద్యార్థిని నిన్న సాయంత్రం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. సమీపంలో గాలించినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం వారి ఇంటి సమీపంలోని పొదల్లో బాలిక మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక బంధువు ఒకరు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికకు చిన్నాన్న వరసయ్యే వ్యక్తి భార్య కువైట్‌లో ఉంటోంది. వారి పిల్లలు నరసాపురంలోని ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నిందితుడు..నిన్న సాయంత్రం బాలిక పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. లైంగికదాడి చేసి ఆ తర్వాత హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. బాలిక దుస్తులు నిందితుడి ఇంటి వద్ద లభించడం, మృతదేహంపై గాయాలుండటంతో లైంగికదాడి చేసి హతమార్చినట్టు భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Spread the love