దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు..

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలోని వికాస్ పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలికపై అత్యచారం వేధింపులు జరిగినట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేరానికి సంబంధించి సోమవారం వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి దారుణ ఘటనలు రోజు పదుల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్దలు అని చూడకుండా మృగాలు ఇలా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణ సంఘటనలకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. కామాంధులు బరితెగిస్తూనే ఉన్నారు. వారి మదపిచ్చికి అమాయక ఆడపిల్లలు బలవుతున్నారు. ఇప్పుడు ఈ తాజా ఘటనపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love